calender_icon.png 12 March, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్టరీగా సుదీక్ష మిస్సింగ్ కేసు..

11-03-2025 11:33:23 PM

కిడ్నాప్ చేశారా.. గల్లంతయ్యిందా..?

ఐదు రోజులైనా కనిపించని అమెరికా సంతతి విద్యార్థిని జాడ..

వాషింగ్టన్: అమెరికాకు చెందిన భారత సంతతి విద్యార్థిని 20 ఏళ్ల సుదీక్ష కోణంకి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఐదు రోజులైనా ఆమె కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో సుదీక్ష తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తె బీచ్‌లో గల్లంతయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అని తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ కూతురు మానవ అక్రమ రవాణా ముఠాకు చిక్కిందా లేక డబ్బుల కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తే బాగుంటుందని సుదీక్ష తండ్రి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మరోవైపు సుదీక్ష మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకున్నామని.. ఆమె జాడ కోసం సముద్రం సహా ఇతర ప్రాంతాలను పూర్తిగా జల్లెడ పడుతున్నట్లు డొమినికా రిపబ్లిక్ అధికారులు పేర్కొన్నారు.

అసలేం జరిగింది?

వర్జీనియాకు చెందిన సుదీక్ష యునివర్సిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్ లో మెడిసిన్ చదువుతోంది. ఇటీవలే యూనివర్సిటీకి సెలవులు ఇవ్వడంతో వెకేషన్ ఎంజాయ్ చేద్దామని భావించిన సుదీక్ష తన స్నేహితులతో కలిసి గత బుధవారం కరేబియన్ దేశమైన డొమినికా రిపబ్లిక్‌కు వెళ్లింది. వీరంతా పుంటా కానాలోని రియు రిపబ్లికా రిసార్ట్‌లో బస చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు రిసార్ట్‌లోనే స్నేహితులతో సరదాగా గడిపిన సుదీక్ష ఉదయం 5.50 గంటల ప్రాంతంలో లోవాకు చెందిన జోషువా స్టీవెన్‌తో కలిసి ఒంటరిగా బీచ్‌కు వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ గల్లంతయ్యింది. సుదీక్ష మిస్ అయిన సంగతిని దాదాపు 12 గంటల పాటు దాచిపెట్టిన ఆమె స్నేహితులు ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బీచ్‌కు చేరుకున్న పోలీసులు హెలికాప్టర్స్, డ్రోన్స్, పడవలు, స్కూబా డైవర్స్, ఏటీవీ సహకారంతో జల్లెడ పట్టినా ఉపయోగం లేకుండా పోయింది.

అయితే సుదీక్షతో కలిసి బీచ్‌కు వచ్చిన స్టీవెన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో స్టీవెన్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు సుదీక్ష ఆచూకీని కనుగొనడంలో విఫలమవుతున్నారు. మద్యం ఎక్కువగా తాగడం వల్ల మత్తుతో చాలాసేపు పడుకున్నానని.. ఆ సమయంలో ఏం జరిగిందో తనకు తెలియదని ఒకసారి.. సముద్రంలో నుంచి ఒక భారీ కెరటం వచ్చి సుదీక్షను లాక్కెళ్లిపోయిందని మరొకసారి.. వాంతి చేసుకోవడంతో తాను బీచ్ ఒడ్డున పడుకోగా.. సుదీక్ష ఒంటరిగా సముద్రం మధ్యలోకి వెళ్లిందంటూ చెప్పడంతో పోలీసులకు కేసు ఛేదించడం కష్టంగా మారిపోయింది. ఈ వ్యవహారంపై అమెరికాలోని వర్జీనియా అధికారులు కూడా రంగంలోకి దిగి డొమినికా రిపబ్లిక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.