calender_icon.png 25 February, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి చేతకాకనే సుధీర్‌రెడ్డి విమర్శలు

25-02-2025 12:00:00 AM

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ఫిబ్రవరి 24 : కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి గెలిపించిన ప్రజలను, కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన  నీతి, నిజాయితీ లేని నీతిమాలిన వ్యక్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ విమర్శించారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నేపథ్యంలో మధుయాష్కీ, జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్  ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ మెంబర్ సుజాత నాయక్, కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులతో కలిసి సోమవారం వనస్థలిపురంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మధుయాష్కీ  మాట్లాడుతూ..

అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని,  మూసీలో బురద తీస్తానని కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి బీఆర్‌ఎస్ లో చేరాడని, మూసీ కార్పొరేషన్ చైర్మన్ గా  సుధీర్ రెడ్డి చేసిందేమీ  లేదన్నారు.  తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు ఢిల్లీలో అధిష్టానం దగ్గర చక్కర్లు కొట్టడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళ్ళ వేళ్ళపడడం చేశాడని విమర్శించారు.

జీ వో 118 పేరుతో ప్రజలకు పనికిరాని డాక్యుమెంట్ చేతిలో పెట్టి మోసం చేసిన చరిత్ర సుధీర్ రెడ్డిది, అప్పటి ప్రభుత్వానిదని విమర్శించారు. అభివృద్ధి చేతకాక, హామీలతో ప్రజలను మోసం చేసి అసమర్థతోనే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుక లారీల అడ్డాను టీజీఐఐసీ స్థలంలోకి తరలించి, ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పిస్తామని లారీ యజమానులకు చెప్పిన సుధీర్ రెడ్డి.

ఇప్పుడు ప్రైవేటు వారికి ఆ స్థలాన్ని కేటాయించి లారీ యజమానులను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హాయంలోనే పార్కింగ్ టెండర్లు పిలవడం... ఆ టెండర్లలో తన అనుచరుడితో టెండర్ వేయించింది నిజం కాదా..? అని ప్రశ్నించారు.  జీవో 118 ద్వారా, లారీల పార్కింగ్ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించి, ప్రజలను సుధీర్ రెడ్డి కళ్ల ఎదుటే మోసం చేశాడని ఆరోపించారు.

అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీధరాబాబు పేరు పెట్టకుండా స్వార్థబుద్ధితో పనులు ప్రారంభించిన వ్యక్తి సుధీర్ రెడ్డి అన్నారు.  మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నెలపాటి రామారావు, బుడ్డ సత్యనారాయణ, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.