‘కంగువా’ చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన నిషాద్ యూసఫ్ (43) ఆకస్మిక మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి బాగానే ఉన్న ఆయన ఏమైందో ఏమో కానీ బుధవారం ఉదయానికి విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కొచ్చిలోని ఓ అపార్ట్మెంటులో నిషాద్ కుటుంబం నివసిస్తోంది. ఆ అపార్ట్మెంటులోనే ఆయన కన్నుమూశారు.
సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిషాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆకస్మిక మరణానికి కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న బాజూకా చిత్రానికి నిషాద్ వర్క్ చేస్తున్నారు.
2022లో విడుదలైన ‘తల్లుమాల’ చిత్రానికి నిషాద్ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్రం నుంచి అవార్డును అందుకున్నారు. ఆయన ఆకస్మిక మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిషాద్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు.