- రాంనగర్‌లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా
- ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కూల్చివేతలు
- మణెమ్మ బస్తీలో రోడ్డుపై నిర్మాణాలు క్లియర్
- 40 ఏండ్లుగా అక్కడే ఉంటున్నామన్న ఆక్రమణదారులు
- అవి అక్రమ నిర్మాణాలేనంటున్న అధికారులు
సిటీబ్యూరో/ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): చెరువులు, కుంటలు, రోడ్లు, నాలాల ఆక్రమణదారులకు హైడ్రా చెమటలు పట్టిస్తున్నది. నిత్యం ఏదో ఒకచోట అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కుల వెన్నులో భయం పుట్టిస్తున్నది. తాజాగా శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్‌లో అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపించింది. రోడ్డును ఆక్రమించి కట్టిన భవనాలను నేటమట్టం చేసింది.
స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. రాంనగర్‌లోని మణెమ్మ గల్లీలో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని బస్తీ వాసులు మనీషాతోపాటు పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 28న (బుధవారం) సాయంత్రం సీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అధికారులతో రంగనాథ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆక్రమణకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
దీంతో 24 గంటల్లోపే అక్రమ కట్టడాలపై శుక్రవారం ఉదయం 8 గంటలకు కూల్చి వేతలు ప్రారంభించారు. హైడ్రా సిబ్బంది దాదాపు 70 మంది, జీహెచ్‌ఎంసీ సిబ్బందితో టౌన్ ప్లానింగ్, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో రోడ్డును అక్రమించి నిర్మించిన మూడంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. రాంనగరంలోని మణెమ్మ గల్లీలో విక్రం యాదవ్, సాయి యాదవ్‌లకు చెందిన 50 గజాల స్థలంలో ఉన్న ఒక గది, ఎల్లయ్యకు ఉన్న మూడంతస్తుల భవనంలో సగభాగం కూల్చివేశారు. ఇదే భవనంలో కింద కల్లు కాంఫౌండ్ ఉండగా పై అంతస్తులో వైష్ణవి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు.
ఈ భవనాన్ని 24 ఫీట్ల రోడ్డుతోపాటు 50 గజాల రేకుల షెడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులు రావడంతో టౌన్ ప్లానింగ్ ఏసీపీ దేవేందర్, సెక్షన్ ఆఫీసర్ హఫీజ్ పర్యవేక్షణలో మూడు బుల్డోజర్లతో విక్రం యాదవ్ ఇంటిని కూల్చివేసిన హైడ్రా సిబ్బంది అనంతరం వెనుక వైపు ఉన్న కల్లు కాంఫౌండ్ రేకుల షెడ్డును కూల్చివేశారు. డ్రిల్ మిషన్‌లతో వైష్ణవి బార్ మూడంతస్తుల స్లాబ్‌ను తొలగించారు. కూల్చివేతల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
1966 నుంచి ఇక్కడే నివసిస్తున్నాం: ఆక్రమణదారులు
ఇండ్ల కూల్చివేతపై ఆక్రమణదారులు ఆవేదన వ్యక్తంచేశారు. 1966 నుంచి ఇక్కడే నివసిస్తున్నామని తెలిపారు. నాలుగు దశాబ్దాల నుంచి ఆస్తి పన్ను కడుతున్నామని విక్రం యాదవ్, సాయి యాదవ్ వాపోయారు. ఇక్కడ మొత్తం 485 గజాల స్థలం తమకు ఉందని, రోడ్డు మధ్యలో నిర్మించామని చెపుతున్న ఇంటిపైన పర్మినెంట్ స్టే ఇస్తూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ఎలాంటి మందస్తు నోటీసులు ఇవ్వకుండా, న్యాయస్థానం ఉత్తర్వులను కాదని తమ ఇంటితో పాటు పక్కనే ఉన్న బాంగారు మైసమ్మ ఆలయాన్ని సైతం కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా అదేశాలతోనే కూల్చివేత: జీహెచ్‌ఎంసీ
హైడ్రా ఆదేశాలతోనే ఆక్రమణలను కూల్చివేశామని సీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. సర్వే నంబర్ 20, 21.. వార్డు 155, బ్లాక్ జమిస్తాన్‌పూర్ గ్రామంలో ఇది ఉన్నట్లు గుర్తించామని, రెవెన్యూ రికార్డుల ప్రకారం అనధికార వ్యక్తులు రోడ్డు మీద 2 తాత్కాలిక నిర్మాణాలు (కల్లు కాంఫౌండ్, తాత్కాలిక షెడ్), ఒక గ్రౌండ్ ప్లస్ పై అంతస్తుల భవనం అనుమతి లేకుండా నిర్మించారని వెల్లడించారు. ఆక్రమణ కారణంగా నాలా నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికి డ్రైనేజీ వ్యవస్థకు అవరోధాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఫలితంగా మణెమ్మ గల్లీ వాసులు రోజూ డ్రైనేజీ ఓవర్ ఫ్లోతో ఇబ్బందులు ఎందుర్కొంటున్నారని చెప్పారు.