గుండె సంబంధిత రోగి ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): గుండె సంబంధిత వ్యాధి కలిగిన పేషెంట్‌కు అత్యంత సవాళ్లతో కూడిన ఎరోటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి రోగి ప్రాణాలను కాపాడామని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బీహార్‌కు చెందిన ఓం ప్రకాశ్ ప్రసాద్(59) తీవ్రమైన గుండె సంబంధిత నొప్పితో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఆయనకు లో ఫ్లో, లో గ్రాడియెంట్ ఎరోటిక్ స్టెనోసిస్ అనే అరుదైన గుండె సమస్య నిర్ధారితమైంది.
మాములుగా హార్ట్ పంపింగ్ కెపాసిటీ 65 శాతం ఉండాలి. కానీ, ప్రసాద్‌కు కేవలం 19 శాతం మాత్రమే ఉంది. 20 శాతం లోపు ఉంటే ఖచ్చితంగా గుండె మార్పిడి చేయాలి. అయితే అతడికి ఎరోటిక్ వాల్వ్ మార్పిడి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడామని వైద్యులు తెలిపారు. ఇది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స కావడంతో పలు ఆసుపత్రులు చికిత్సను నిరాకరించాయి. చివరిగా బేగంపేట మెడికవర్ హాస్పిటల్స్‌లోని సీటీవీఎస్ డాక్టర్ సుధీర్ బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించి.. రోగి ప్రాణాలను కాపాడింది.
7 రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందిన అనంతరం క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీటీవీఎస్ సర్జన్ డాక్టర్ సుధీర్, కార్డియాలజిస్ట్ సాకేత్, అనస్థీషియాలజిస్ట్ మానస, సెంటర్ హెడ్ డాక్టర్ రాజ్ కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ హెడ్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. అత్యాధునిక సదుపాయాలు, పరికరాలు, అనుభవ జ్ఞులైన వైద్యుల బృందం ఉండటం వలనే ఇటువంటి చికిత్సలు అందించడం సాధ్యమవుతున్నాయని తెలిపారు.