01-03-2025 05:49:48 PM
సిద్దిపేట అర్బన్,(విజయక్రాంతి): ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయబోతున్న ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) విధానం కు వ్యతిరేకంగా మార్చ్ 2 వ తేదీన ధర్నా చౌక్ (హైదరాబాద్) లో జరిగే యూపీఎస్ పై యుద్ధభేరిని విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్(Telangana State Contributory Pension Scheme Employees Union) రాష్ట్ర ఉపాధ్యక్షులు కురాకుల శ్రీనివాస్(TSCPSEU Vice President Kurakula Srinivas) అన్నారు. శనివారం సిద్దిపేట అర్బన్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఎస్ వద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ద కాలంగా పోరాటం జరుగుతున్నదన్నారు. కొత్తగా యూపీఎస్ పేరుతో ఉద్యోగుల భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని, దీనివల్ల ఉద్యోగుల జీవితాలు మరింత దుర్భరం అవుతాయనీ ఆందోళన వ్యక్తం చేశారు. యూపీఎస్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనీ, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని సీపీఎస్ నుంచి యూపీఎస్ కు వెళ్లే విధానాన్ని అదే శాఖ తయారు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలను వాటి హక్కులను కాలరాయడమే అవుతుందనీ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. యుద్ధభేరికి రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల సి పి ఎస్ ఉద్యోగ, ఉపాద్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు మాడుగుల శ్రీనివాస్, శ్రీనివాస్, నర్మదా, రాజేశం, ఇస్మాయిల్, జొహాన్ తదితరులు పాల్గొన్నారు.