calender_icon.png 7 October, 2024 | 10:52 AM

విజయమే లక్ష్యంగా

06-10-2024 12:00:00 AM

నేడు పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ 

ఒత్తిడిలో హర్మన్ సేన

మధ్యాహ్నం 3.30 నుంచి 

మహిళల టీ20 ప్రపంచకప్

5 - టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌లు ఏడుసార్లు ముఖాముఖి తలపడగా.. టీమిండియా ఐదుసార్లు నెగ్గగా.. పాక్ రెండుసార్లు గెలిచింది.

ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్ ఓటమిని దేవుడికి వదిలేసి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనున్న పోరులో గెలిచి ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దాయాదిపై విజయంతో గర్జించి మెగాటోర్నీలో బోణీ చేయాలని ఆశిద్దాం..

దుబాయ్: యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ సేన ఒక్కరోజు వ్యవధిలో రెండో గ్రూప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. మెగాటోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా గ్రూప్-ఏలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం మూటగట్టుకున్న టీమిండియా టోర్నీని పేలవంగా ఆరంభించింది. ఈ ఓటమిని మరిపిస్తూ దాయాదిపై విజయంతో భారత్ పోటీలో నిలవాలనే పట్టుదలతో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక ఓడిపోతే టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టమయ్యే చాన్స్ ఉంది.

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న భారత్ దానిని నిలబెట్టుకుంటూ విజయం సాధించాలని కోరుకుందాం. మరోవైపు పాకిస్థాన్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసి శుభారంభం చేసింది. భారత్‌పై అదే జోరును కనబరిచి సెమీస్ రేసులో మరింత ముందంజ వేయాలని భావిస్తోంది.

బ్యాటింగ్, బౌలింగ్ మెరవాల్సిందే..

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తిగా నిరాశపరిచింది. బౌలింగ్ బలంగా ఉండడం కోసం ఒక బ్యాటర్ స్లాట్‌ను వదిలేసుకోవడం భారత్ కొంపముంచింది. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు కూడా ఆటపై ప్రభావం చూపింది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ రాణించాల్సిన అవసరముంది.

కివీస్‌తో మ్యాచ్‌లో పక్కనబెట్టిన దయాలన్ హేమలత ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశముంది. తనకు అచ్చొచ్చిన మూడో నంబర్‌లో ఆమె బ్యాటింగ్‌కు రానుంది. ఇక కివీస్‌తో పోరులో రెగ్యులర్ స్థానం నాలుగో నంబర్ కాదని వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ చేతులు కాల్చుకుంది. దుబాయ్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమైనప్పటికీ ఓపికగా ఆడితే పరుగులు వస్తాయని న్యూజిలాండ్ నిరూపించింది.

ఇక మిడిలార్డర్‌లో హర్మన్‌తో పాటు జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ బ్యాట్ ఝలిపించాల్సిన అవసరముంది. రేణుకా సింగ్, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక/ అరుంధతీ, పూజా వస్త్రాకర్‌లతో బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ కివీస్‌తో మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు.

పాక్‌పై బౌలింగ్‌లో ఎంతమేర రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు శ్రీలంకపై విజయంతో వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన పాకిస్థాన్ ఫుల్ జోష్‌లో ఉంది. జట్టును అన్నీ తానై నడిపిస్తోన్న కెప్టెన్ ఫాతిమా సనా మరోసారి కీలకం కానుండగా..నిదా దర్, మునీబా అలీ, సైదా ఇక్బాల్, ఒమామియాలు రాణించే అవకాశముంది.

భారత్‌దే పైచేయి..

పురుషుల క్రికెట్ మాదిరిగానే మహిళల క్రికెట్‌లోనూ పాకిస్థాన్ జట్టుపై భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 15 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. టీమిండియా 12 సార్లు విజయాలు సాధించగా.. పాక్ మాత్రం మూడుసార్లు మాత్రమే నెగ్గింది.

ఇక టీ20 ప్రపంచకప్‌లో దాయాదులు తలపడిన ఏడు సందర్భాల్లో భారత్ ఐదింటిలో నెగ్గి ఆధిపత్యం కనబరిచింది. 2009 నుంచి ఇరుజట్ల మధ్య మ్యాచ్‌లు జరగ్గా.. పాకిస్థాన్ 2012, 2016లో మాత్రమే భారత్‌పై విజయం సాధించింది. చివరగా 2023 టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు పాక్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.