calender_icon.png 20 November, 2024 | 9:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సక్సెస్ ముఖ్యం బిగిలూ..

10-11-2024 12:00:00 AM

ఒక మంచి కథను తీసుకుని దానికి కావల్సిన హంగూ ఆర్భాటాలన్నీ అద్ది.. చక్కగా ముస్తాబు చేసి కొన్ని విషయాలు చెప్పి.. చివరలో ఒకటీ అరా దాచేసి దర్శకులు సినిమాను విడుదల చేస్తున్నారు. అంతే అసలు సినిమా హిట్.. చివర వదిలేసిన ట్విస్ట్‌తో తీసిన సీక్వెల్ సూపర్ హిట్. ఒక అద్భుత సామ్రాజ్యాన్ని సృష్టించి.. వీఎఫ్‌ఎక్స్‌తో కావల్సిన హంగులన్నీ అద్ది ‘బాహుబలి’ పేరిట వదిలితే.. ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు.

సినిమా విడుదలైంది మొదలు ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అంటూ తెగ ముచ్చటించుకున్నారు. ఈ ఒక్క సినిమాయే కాదు.. కేజీఎఫ్ సినిమా తర్వాత సీక్వెన్స్ కోసం ప్రేక్షకులు ఎంత పిచ్చిగా ఎదురు చూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలకు ఆ పిచ్చిని ఇంజెక్ట్ చేయడంలో దర్శకులు సక్సెస్. 

సలార్.. ఖైదీ.. హిట్, పుష్ప, దేవర, కాంతారా, గూఢచారి, జై హనుమాన్ ఇలా చాలా సినిమాలు ప్రస్తుతం సీక్వెల్ బాటలో ఉన్నాయి. సీక్వెల్ అనేది ఇప్పుడు మొదలైన ట్రెండ్ కాదు.. ఎప్పుడో ప్రారంభమైంది. కానీ అప్పట్లో సీక్వెల్‌కి సక్సెస్ రేటు చాలా తక్కువ. అప్పట్లో గాయం సినిమా మంచి సక్సెస్ సాధించింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం 2 బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

మనీ మనీ మోర్ మనీ, ఆర్య 2, సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2, చంద్రముఖి 2 (నాగవల్లి), మన్మథుడు 2,  శంకర్ దాదా జిందాబాద్ వంటి సీక్వెల్స్ ఏవీ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య సినిమా మంచి సక్సెస్ సాధించింది. సీక్వెల్ పోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప మంచి సక్సెస్.

పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. పుష్పను మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందని ప్రేక్షకులే చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్ కంటే ప్రేక్షకుడు ఒక సినిమా సక్సెస్ విషయంలో ధీమాతో ఉండటం ఆసక్తికరం. ఇలా ఒకటేమిటి? అన్ని సీక్వెల్స్ విషయంలోనూ ఇదే జరుగుతోందంటే అతిశయోక్తి కాదు.

నరాలు తెగే ఉత్కంఠ కావాలి..

ఒకప్పుడు సీక్వెల్స్ జనాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.. ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయంటే కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్. అప్పటి దర్శక నిర్మాతకు, ఇప్పటి వారికి ప్రమోషన్స్ విషయంలో చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమా మొదలు కాక ముందు నుంచే నిత్యం తమ సినిమాను ప్రేక్షకుల నోళ్లలో నానేలా చేస్తున్నారు.

ఏదో ఒక లీక్ ఇచ్చేస్తున్నారు. రాజమౌళి-మహేశ్ బాబు కాంబో చిత్రాన్ని పరిశీలిస్తే కథ గురించి ఇప్పటికే లీక్స్ వచ్చేశాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోందట అంటూ టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే కాలర్ ఎగురవేస్తున్నారు. లొకేషన్స్ వెదికే ఫోటోలను సైతం రాజమౌళి నెట్టింట షేర్ చేశారు. ఇలా సినిమా అనుకుంటున్న నాటి నుంచి ఏదో ఒక రకంగా ప్రచారం జరుగుతూనే ఉంది.

ప్రచారాన్ని కొంత పుంతలు తొక్కిస్తున్నారు. కానీ అప్పట్లో ఇలాంటి ప్రచారం లేదు. ఇది కూడా అప్పట్లో సినిమాల ఫెయిల్యూర్‌కు ఓ కారణం. అంతేకాకుండా ఎంచుకునే కథ కూడా అసలుకి మించి ఉండాలి. కథనం వివరించే తీరులో ప్రేక్షకుడికి నరాలు తెగే ఉత్కంఠ కావాలి. లేదంటే కథలో లీనమైపోయే అంశాలైనా ఉండాలి. ఇప్పటి దర్శకులు ఇదే చేస్తున్నారు.

దర్శకులకే ఆ క్రెడిట్..

ఏ సినిమా తీసుకున్నా కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకదానితో మరో దానికి సంబంధమే ఉండదు. బాహుబలి, సలార్, ఖైదీ, పుష్ప, కాంతారా, హిట్, హనుమాన్ వీటి కథలు ఒకదానితో మరో దానికి సంబంధం ఉండదు. చివరకు భక్తి ప్రధాన చిత్రాలతో కూడా మంచి సక్సెస్ సాధిస్తున్నారు. పైగా వాటి సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చూస్తున్నారు.

కాంతారా, హనుమాన్ ఈ కోవకు చెందినవే. ‘హిట్’ సినిమా అయితే సీక్వెల్స్ మీద సీక్వెల్స్ వస్తున్నాయి. మొత్తానికి మంచి కథ.. ప్రచారంతో పాటు ప్రతి విషయంలోనూ దర్శకులు తీసుకునే జాగ్రత్త సినిమాను శిఖరంపై నిలబెడుతున్నాయి. ఇప్పటి కథలు దాదాపుగా ఊహాజనితమే.

పైగా ఏడాదికి మూడు సినిమాలు తీశాం.. నాలుగు తీశామని చెప్పే దర్శకులు లేరిప్పుడు. ఒక్కో సినిమా కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుని పూర్తి పర్ఫెక్షన్‌తో దర్శకులు సినిమా తీస్తున్నారు. అందుకే ఈ సినిమాలకు అంత క్రేజ్. దర్శకులకే ఆ క్రెడిట్. సమయం కాదు.. సక్సెస్ ముఖ్యం బిగిలూ అంటున్నారు దర్శకులు.  

 ప్రజావాణి చీదిరాల