29-03-2025 12:44:02 AM
‘సక్సెస్ అంటే కేవలం విజయాలు సాధించడమే కాదు.. సామాజిక పట్టింపులు, కట్టుబాట్ల నుంచి విముక్తి పొందడమే నిజమైన గెలుపు అవుతుంది’ అంటూ అందరిలో స్ఫూర్తి నింపే వ్యాఖ్యలు చేసింది నటి సమంత రుతుప్రభు. కొన్ని రోజులుగా సిడ్నీలో పర్యటిస్తున్న సమంత అక్కడ ఇటీవల జరిగిన ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సిడ్నీ’లో పాల్గొన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్‌లో రాణించడం, స్వేచ్ఛగా జీవించటం, మూస ధోరణి భావనలను సవాలు చేయడంపై ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ‘నా దృష్టిలో స్వేచ్ఛ, స్వతంత్రమే సక్సెస్. నేను సక్సెస్ అయ్యానని ఎదుటివారు చెప్పేవరకూ వేచిఉండను.
మనకు నచ్చినవిధంగా జీవించడం, మన అభిరుచికి తగ్గట్టుగా పనులు చేయడమే సక్సెస్.. అంతేకానీ మహిళలను ఒకచోట బంధించి, ఇదే చేయాలి.. అది చేయకూడదు.. అంటూ చెప్పడం కాదు. నిజ జీవితంలో ఎన్నోరకాల పాత్రలను పోషిస్తూ అన్నింటిలో సమర్ధంగా రాణించగలిగినప్పుడే విజయం సాధించినట్టు లెక్క. నూతన టాలెంట్‌ను, అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించేందుకు నేను చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను’ అని సమంత తెలిపింది.
సిడ్నీ పర్యటనలో భాగంగా ఆమె ఇటీవల అక్కడి యువతతో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాన్నొకటి పంచుకున్నారు. తాను కన్న కలల్లో ఒకటి నెరవేరలేదని ఆమె చెప్పారు. ‘చదువుకునే రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్లాలని.. సిడ్నీ యూనివర్సిటీలో చదువుకోవాలని నేను అనుకున్నాను. కానీ అది నెరవేరలేదు. నేను అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. అయితే, ఇప్పుడు నటిగా ఇంతమంది అభిమానం పొందడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.
ప్రతి ఒక్కరూ తమ కలల సాకారం దిశగా అడుగులు వేయాలి’ అని చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్’ యాక్షన్ సిరీస్ కోసం పనిచేస్తోంది. ఇంకా ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తున్నట్టు కూడా ఇటీవలే ప్రకటించిందామె. మరోవైపు సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘శుభం’ ఫస్ట్‌లుక్‌ను టీమ్ ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.