ఫైనల్ లో విజేతగా నిలిచిన ఎస్.సి.సి.ఎల్ జట్టు
బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): క్రికెట్ జట్టులో 11మంది సమిష్టిగా ఆడినప్పుడే అవతలి జట్టును ఓడించి విజయం సాధిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది యెర్రా కామేష్ అన్నారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో గెట్ టు గెదర్ లెజెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ లో ఆదివారం సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. లీగ్ కం నాకౌట్ క్రికెట్ మ్యాచ్ లు మూడు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఆదివారం జరిగిన సెమి ఫైనల్ మ్యాచుల్లో విజేతలుగా నిలిచిన ఓజీ జట్టు, ఎస్.సి.సీ.ఎల్ జట్టు ఫైనల్ లో తలపడ్డాయి. ఫైనల్ లో గెలుపొందిన ఎస్.సి.సి.ఎల్ జట్టుకు ముఖ్యఅతిథిగా హాజరైన యెర్రా కామేష్ ట్రోఫీని అందజేశారు. టాస్ గెలిచిన ఎస్.సి.సీ.ఎల్ జట్టు తోలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 10 ఓవర్లలో ఎస్.సి.సీ.ఎల్ జట్టు 74 పరుగులు చేసి అయిదు వికెట్లు కోల్పోయింది.
75 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఓజీ లెవన్ జట్టు త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఓటమి అంచుల్లోకి వెళ్లిన సమయంలో హరి, సురేష్ నాలుగో వికెట్ కు బలమైన భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై నమ్మకాన్ని నిలిపే క్రమంలో 6వ ఓవర్ వేసిన ఉమేష్ వెంటవెంటనే రెండు వికెట్లు తీయగానే ఓజీ లెవన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఎట్టకేలకు ఫైనల్ మ్యాచ్ లో ఎస్.సి.సీ.ఎల్ జట్టు విజయదుందుబి మోగించింది. రాజేందర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ లెజెండ్ క్రికెట్ టోర్నమెంట్ లో 40 సంవత్సరాలు పైబడిన క్రీడాకారులతో నిర్వహించిన ఈ మెగా టోర్నమెంట్ లో స్థానికంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించిన ఒకప్పటి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో యంగ్ స్టార్ లెవెన్, ఎస్.సి.సి.ఎల్ ఉత్కంఠ మధ్య జరగగా చివరి బంతికి ఎస్.సి.సి.ఎల్ గెలుపొందరు. ఈ మ్యాచ్ లకు ఎంపైర్లుగా లింగేష్, జహేద్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేవర్ల రాజేష్, లింగేశ్, పుష్పరాజ్, దుశాంత్, రాజారమేష్, అనిల్, రఫీ తదితరులు పాల్గొన్నారు.