ప్రపంచం మనిషి ‘సెల్’లో బంధీ అయింది. వింతలు విశేషాలు తెలుసుకోవడమంటే.. పక్కింటికికెళ్లి పంచదార తెచ్చుకున్నంత సులభ‘తరం’గా మారింది. తమ ఆవిష్కరణలు స్థానికంగానే ‘తెర’మరుగు కాకూడదన్న ఆలోచన ధోరణి.. కళానైపుణ్యాలను ప్రపంచం నలుమూలలకూ చేర్చగలుగుతోంది. సినిమా రంగంలో ఈ మార్పు ఇంకా సుస్పష్టంగా కనిపిస్తుంది. సబ్ టైటిల్స్‌తో విడుదలవుతున్న చిత్రాలు అంతర్జాతీయంగా ఉన్న సినీప్రియుల ఆదరణ పొందగలుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. సబ్ టైటిల్స్ ఉంటే అది సబ్ కా సైన్మా అన్నట్టే!
ఇన్నాళ్లూ అంతర్జాతీయ వేదికపై సినీ ప్రేక్షకులకున్న హద్దులను సాంకేతిక పరిజ్ఞానం చెరిపేసింది. ఈ నేపథ్యంలో స్వీయ భాషలోని సినిమాలు మాత్రమే చూసే కాలం ‘తెర’మరుగైంది. భాషా అడ్డంకులను తొలగిండం, ప్రేక్షకుల పరిధిని విస్తరింపజేయడం, భారతదేశంలోని విభిన్న భాషల వారు అన్ని ప్రాంతాలు, భాషల సినిమాలను చూసే తీరును మార్చడంలో సబ్‌టైటిల్స్ (ఉపశీర్షికలు) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఏ కొస నుంచి ఏ కొనకైనా.. కోవిడ్ టైం నుంచే!
ప్రపంచంలో ఏ కొసన నిర్మితమైన సినిమా అయినప్పటికీ.. ఇప్పుడు ఏ కొనకైనా చేరుతోంది. అది కోవిడ్ కాలం నుంచే సాధ్యమైంది. భారతదేశంలో మొత్తం 23 అధికారిక భాషలున్నాయి. అయితే, 2020 వరకు సబ్ టైటిల్స్ కలిగి ఉండే సినిమాలు కేవలం హిందీ, ఇంగ్లీషుల్లో మాత్రమే లభించేవి. ఈ కారణంగా భాష, ప్రాంతం సరిహద్దులకు అతీతంగా రూపొందించబడిన గొప్ప చిత్రాలెన్నో అన్ని భాషల వారు చూసే అవకాశం ఉండేది కాదు. కానీ, ఈ విషయంలో కోవిడ్ మేలు చేసింది.
మనం సినిమాలు, షోలను ఎలా చూస్తామనే అంశంతో సహా అన్నిటినీ మార్చేసిందా మహమ్మారి. ఓ మీడియా కన్సల్టింగ్ సంస్థ సర్వే ప్రకారం.. అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ కంటెంట్‌ను చూస్తున్న భారతీయుల సంఖ్య 2022 నాటికి 85.2 మిలియన్లకు పెరిగింది. అంతకు ముందు ఆ సంఖ్య 19.1 మిలియన్లుగా మాత్రమే ఉండేది. ఇది కోవిడ్ టైం కన్నా 126 శాతం పెరుగుదలను సూచిస్తుంది. గత నాలుగేళ్లలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో స్థానిక కంటెంట్ వాటా 30 శాతం నుంచి 55 శాతానికి పెరిగిందనేది మరో నివేదిక చెప్తున్న విషయం.
సబ్‌టైటిల్స్ ప్రక్రియతో ప్రేక్షకుల సంఖ్య రెట్టింపు
భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూసే భారతీయుల అలవాటును మార్చడంలో డబ్బింగ్, ఉపశీర్షిక ముఖ్యమైన పాత్ర పోషించాయనేది ఓ నివేదిక సారాంశం. సాధారణంగా ఓటీటీ వేదికలపై ఆధారపడే స్ట్రీమింగ్ ప్రేక్షకులు సగటున 2.3 భాషల్లో కంటెంట్‌ను చూసేవారు. డబ్బింగ్, ఉపశీర్షికల ప్రక్రియ ఆరంభమైన తర్వాత ఈ సంఖ్య రెట్టింపు అయింది. అంటే 4.6కు చేరిందని నివేదిక పేర్కొంది. ఇందులో మలయాళం కంటెంట్‌ను ఇష్టపడే వారి సంఖ్య 70 శాతంగా ఉంది.
భావం దెబ్బ తినకుండా...
భాషలోని సౌందర్యం లోపించకుండా, వ్యాకరణ భావం దెబ్బ తినకుండా, సారాంశాన్ని కోల్పోకుండా ఏ కంటెంట్‌నైనా ఇప్పుడు ఆస్వాదించగలుగుతున్నారు ప్రేక్షకులు. ఇలా భాషా హద్దులను చెరిపేస్తూ ప్రేక్షకాదరణ పొందిన వాటిలో ‘మనీ హీస్ట్ : కాసా డెల్ పాపెల్’ చక్కటి ఉదాహరణ. స్పానిష్‌లో రూపొందిన ఈ వెబ్ సిరీస్.. 2021లో భారతదేశంలో అత్యధికులు చూసిన నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా రికార్డు సాధించింది. దక్షిణభారతంలో మొదట తెలుగు, తమిళంలో విడుదలైన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ఉత్తరాదిలోనూ బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది. ఇలా ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’ కూడా బహు భాషా మార్కెట్లలో పెద్ద మొత్తపు వ్యాపారాన్ని చేశాయి.
ఇంకా హ్యూ జాక్‌మన్, ర్యాన్ రేనాల్డ్స్ తాజా మార్వెల్ చిత్రం ‘డెడ్‌పూల్ అండ్ ఉల్వరైన్’ మన దేశంలో 2024లో అత్యధిక సంపాదన పొందిన వాటిల్లో ఒకటి. ఇలా చాలా మంది భారతీయులు.. తాము రోజువారీగా చూసే ప్రసారాలను పక్కకు నెట్టి కొరియన్ నాటకాలకు మారారు. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఇట్స్ ఓకే నాట్ టు బీ ఓకే’, ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’, ‘సిగ్నల్’, ‘స్క్విడ్ గేమ్స్’ వంటి అనేక ఇతర కొరియన్ డ్రామాలకు అత్యధిక ప్రేక్షకులు భారతీయులు కావటమే ఇందుకు నిదర్శనం.
దక్షిణాది చిత్రాల సత్తా వెనుక ఉన్నది సబ్‌టైటిల్స్ మాయే!
సాధారణంగా సబ్‌టైటిల్స్ వినికిడి సమస్య ఉన్నవారికి, పరభాషా జ్ఞానం లేనివారికి ఉపయుక్తంగా ఉంటాయి. నటీనటుల విభిన్న స్వరాలు అర్థం చేసుకోవడం సవాలుగా మారిన తరుణంలో ఇటీవల సబ్‌టైటిల్స్ అవసరం పెరిగింది. రెండు దశాబ్దాలుగా ముఖ్యమైన మల్టీప్లెక్స్‌లలో సబ్‌టైటిల్స్‌తో షోలు వేయడం అనివార్యమైంది. 2022లో చేసిన సర్వే ప్రకారం.. 1,200 మంది అమెరికన్లలో సగం మంది కంటెంట్‌ను సబ్‌టైటిల్స్‌తో చూడటానికే ఇష్టపడుతున్నారు.
2023లో ‘ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రం పలు అవార్డులు దక్కించుకోవడానికి మార్గం సుగమం కావడానికి కారణం ఇదే. ఇందులో నటులు కోలిన్ ఫారెల్, బ్రెండన్ గ్లీసన్ డైలాగ్‌లు ఇంగ్లిషులో ఉండటంతో వేర్వేరు భాషల వారు అర్థం చేసుకోవటం కష్టమైంది. అయినా సినిమా ఎక్కువ మంది ప్రశంసలు పొందటానికి కారణం ఉపశీర్షికలే. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ చిత్ర పరిశ్రమల ధాటికి హిందీ చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఇదంతా సబ్‌టైటిల్స్ వల్లే సాధ్యమయ్యిందనేది నిజం.