calender_icon.png 11 October, 2024 | 7:50 AM

ఎలక్ట్రిక్ వాహనాల కోసం సబ్సిడీ స్కీమ్

02-10-2024 12:00:00 AM

పీఎం ఈ డ్రైవ్ ప్రారంభం

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరిగేందుకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ స్కీమ్‌ను ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. 2024 అక్టోబర్ 1 నుంచి 2026 మార్చి 31వరకూ ఈ స్కీమ్ అమలులో ఉంటుంది. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ టూవీలర్స్‌కు బ్యాటరీ పవర్ ఆధారంగా కిలోవాట్ అవర్‌కు రూ.5,000 చొప్పున తొలి ఏడాదికి రూ.10,000 మించకుండా సబ్సిడీ లభిస్తుంది.

రెండో ఏడాది కిలోవాట్ అవర్‌కు రూ.2,500 చొప్పున రూ.5,000 మించకుండా ప్రోత్సాహకాన్ని నిర్ణయించారు. స్కీమ్ ప్రారంభం సందర్భంగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హనీఫ్ ఖురేషి మాట్లాడుతూ సబ్సిడీ ప్రక్రియ సజావుగా సాగడానికి, ఈ వోచర్లు పొందడానికి ఒక మొబైల్ యాప్‌ను ప్రవేశ పెడతామని చెప్పారు.

ఒక ఆధార్ కార్డుకు ఒక వాహనాన్ని మాత్రమే అనుమతిస్తామని, ఒక వాహనం విక్రయంకాగానే, ఆటోమేటిక్‌గా ఈ వోచర్ జనరేట్ అవుతుందని తెలిపారు. ఈవోచర్‌ను డౌన్ లోడ్ చేసుకునే లింక్‌ను కొనుగోలుదారు రిజిష్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. అటుతర్వాత వోచర్‌పై కొనుగోలుదారు సంతకం చేసి, డీలర్‌కు ఇచ్చి ప్రోత్సాహకాల్ని పొందవచ్చు.

  టూ వీలర్లు, త్రీవీలర్లు, ఈ -రిక్షాలు, అంబులెన్సులు, ఈ-ట్రక్కులు, ఈ- బస్‌లకు ఈ స్కీమ్ కింద ప్రోత్సాహకాలు లభిస్తాయి.  త్రీవీలర్లు, ఈ -రిక్షాలకు తొలి ఏడాది రూ. 25,000, రెండో ఏడాది రూ.12,500 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. కార్గో త్రీవీలర్స్‌కు తొలి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.25,000 చొప్పున ప్రోత్సాహకాన్ని నిర్ణయించారు.