calender_icon.png 25 October, 2024 | 11:54 AM

నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద

12-08-2024 02:08:23 AM

  1. ఎగువ నుంచి 2.17లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 
  2. 12 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల

నల్లగొండ, ఆగస్టు 11 (విజయక్రాంతి): నాగార్జునసాగర్‌కు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి కేవలం 2.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఆదివారం ఉదయం వరకు 26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగించిన అధికారులు 12 గేట్ల నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ నీటిమట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588 అడుగులు (306.04 టీఎంసీలు)గా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం రెండు అడుగులు మాత్రమే ఉండటంతో ఎగువ నుంచి వచ్చే ప్రవాహం ఆధారంగా అర్ధరాత్రికి మరిన్ని క్రస్టుగేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్‌లో భారీగా పర్యాటకుల రద్దీ కనిపించింది. క్రస్టుగేట్లు, పవర్ హౌస్, మెయిన్ డ్యామ్ పరిసరాల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. 

లోలెవల్ కాల్వ గండి పూడ్చివేత 

లోలెవల్ కాల్వ గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. దీంతో ఆదివారం ఉదయం అధికారులు కాల్వకు నీటి విడుదల ప్రారంభించారు. ఉదయం 200 క్యూసెక్కులు విడుదల చేయగా సాయంత్రానికి 400 క్యూసెక్కులకు పెంచుతామని తెలిపారు. అనుముల మండలం మారేపల్లి వద్ద ఈ నెల 6న 36వ కిలోమీటర్ వద్ద కాల్వకు గండిపడిన విషయం తెలిసిందే. కాల్వలో పూర్తిగా కంపచెట్టు పేరుకుపోవడం, సీసీ లైనింగ్ లేక గట్లు బలహీనంగా మారడంతో గండిపడింది. ఐదు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరమ్మతు చేపట్టారు. 53 కిలోమీటర్ల మేర కాల్వ ఉండటంతో కట్ట బలహీనమైన ప్రాంతాలను ఇటీవల అధికారులు పరిశీలించారు. 

కృష్ణానదికి తగ్గిన వరదలు

హైదరాబాద్/నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): కృష్ణానది పరిధిలో ఆల్మట్టి నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గుతున్నది. ఆల్మట్టికి 50వేలకు పైగా ఇన్‌ఫ్లో ఉండగా... అవుట్ ఫ్లో తగ్గించారు. నారాయణపూర్ నుంచి కూడా కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే నీటిని విడుదల చేస్తామన్నారు. దీంతో జూరాలకు మరో రెండు రోజుల్లో వరద తగ్గుముఖం పట్టనుంది. తుంగభద్ర ప్రాజెక్టు గేటు ఊడిపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటిలో దాదాపు 6ంశాతం ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా దాదాపు 60 నుంచి 65 టీఎంసీల నీటిని దిగువనకు విడుదల చేయనున్నారు. ఆ నీరు మొదటగా తెలంగాణలోని సుంకేసులకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లనుంది. దీంతో శ్రీశైలానికి ఈ వరద మరో వారం రోజుల పాటు కొనసాగనుంది. 

సాగర్ ఎడమ కాల్వలో యువకుడి గల్లంతు

సూర్యాపేట: సాగర్ ఎడమ కాల్వలో పడి యువకుడు గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని వెలిదండ గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన లచ్చిమళ్ల వెంక ట్(21) వెలిదండ గ్రామంలో బంధువు పెళ్లికి వెళ్లాడు. గ్రామ సమీపంలో గల సాగర్ ఎడమ కాల్వలో స్నానం చేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడి గల్లంతయ్యాడు. గరిడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వెంకట్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. వెంకట్ హుజూర్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది.