calender_icon.png 13 February, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత జాబితాలో చేర్చిన ఉత్తర్వులు సమర్పించండి

13-02-2025 01:28:03 AM

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నెం.181లోని 103.35 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేరుస్తూ జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలంటూ బుధవారం ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ యజ్ఞ బోర్డుకు చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిం ది.

నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్టర్ చేయడాన్ని సవాలు చేస్తూ మహ్మద్ ఫరూజ్ అలీఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి హక్కులకు సంబంధించిన వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలంటూ కొట్టివేశారు.

దీన్ని సవాలు చేస్తూ ఫరూజ్ అలీఖాన్ దాఖలు చేసిన అప్పీలుపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ భూదాన్ భూములంటూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయరాదని, అయితే ఇక్కడి రిజిస్ట్రేషన్ అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్ చేశారన్నారు.

నిబంధనలను ఉల్లంఘించి నందున పిటిషన్ విచారణార్హమేనన్నారు. అయితే దీన్ని పట్టించుకోకుండా పిటిషన్ విచారణార్హం కాదని, సివిల్ కోర్టును ఆశ్రయించాలంటూ సింగిల్ జడ్జి కొట్టివేశారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.