calender_icon.png 11 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్ సమర్పించండి

11-01-2025 12:09:13 AM

బీసీఐ, రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల షెడ్యూల్‌ను సమర్పించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తోపాటు రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పాలకవర్గం గడువుతోపాటు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తర్వాతి విచారణలోగా సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.

బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది కె.అశోక్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఎస్.ప్రసాద్ వాదనలు వినిపిస్తూ బార్ కౌన్సిల్ సభ్యుల 5 ఏండ్ల పదవీ కాలం ముగిసిందని చెప్పారు.  బీసీఐ ఆరు నెలలు గడువు పొడిగించిందని, ఆ గడువు కూడా ముగిసిపోయిందన్నారు.

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బార్ కౌన్సిళ్లలో సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టిసింగ్ (సీవోపీ) జరుగుతోందని, ఇది పూర్తయ్యాక ఎన్నికల నిర్వహణ ఉంటుందన్నారు. పదవీ కాలాన్ని పొడిగించే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉందన్నారు.