calender_icon.png 9 October, 2024 | 6:51 PM

మునిగిన పాలమూరు పంపులు

04-09-2024 01:05:16 AM

వట్టెం పంప్‌హౌస్‌లోకి భారీగా వరద నీరు

నీటిలో 6 బాహుబలి మోటర్లు

  1. నిర్లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టర్
  2. 20 కి.మీ పొడవునా టన్నెల్‌లో వరదనీరు
  3. శ్రీపురం ప్యాకేజీ 7వ ఆడిట్ నుంచి లోనికి నీరు
  4. తూతూ మంత్రంగా ఏర్పాటుచేసిన రక్షణ గోడ
  5. విచారణకు ఆదేశించిన నీటిపారుదల శాఖ
  6. ముందే హెచ్చరించిన ‘విజయక్రాంతి’ 

నాగర్‌కర్నూల్/హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదాల నుంచి నీటిపారుదల శాఖ ఏమాత్రం పాఠాలు నేర్చు కోలేదని మరోసారి రుజువైంది. బరాజ్‌లు కూలినా, పంపులు మునిగినా పోతే పోయింది అన్నట్టుగా అధికారులు, నేతల తీరు ఉండటంతో మరోసారి ప్రజాధనం వరద పాలైంది. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కీలకమైన వట్టెం పంప్‌హౌస్ పూర్తిగా నీట మూనిగింది. అందులోని ఆరు భారీ మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి.

అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం వెరసి ప్రజల ప్రయోజనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలోని మూడో పంప్‌హౌజ్ అయిన వట్టెం సర్జ్‌పూల్‌తోపాటు పంప్‌హౌజ్, అందులోని 6 భారీ మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. శ్రీపురం ప్యాకేజీలోని 7వ ఆడిట్ నుంచి భారీగా వరద నీరు రావడంతో దాదాపు ౨౦ కిలోమీటర్ల పొడవైన టన్నెల్ మొత్తం వరద నీటితో నిండిపోయింది.

ఈ టన్నెల్ నుంచి వచ్చిన వరద నీరు పంప్‌హౌజ్ వద్దకు చేరి మోటర్లను కూడా ముంచెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నాలుగైదు రోజుల ముందే హెచ్చరించినా నీటిపారుదల శాఖ పట్టించుకోలేదు. దీని ఫలితంగానే వట్టెం రిజర్వాయర్ (వెంకటాద్రి రిజర్వాయర్)లోకి నీటిని ఎత్తిపోసే పంప్‌హైజ్‌లోకి వరద నీరు చేరి భారీ నష్టాన్ని మిగిల్చింది. దీనిపై నీటిపారుదల అధికారులు గుంభనంగా ఉన్నారు. 

20 కిలోమీటర్లపైగా టన్నెల్

పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా వట్టెం రిజర్వాయర్ (వెంక టాద్రి రిజర్వాయర్)లోకి ఎత్తిపోసేందుకు ఏర్పాటుచేసిన వట్టెం పంప్‌హౌజ్‌కు నీరు వచ్చేందుకు ఏదులలోని వీరాంజనేయ రిజ ర్వాయర్ నుంచి సుమారు 20.9 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను తవ్వారు. ఈ టన్నెల్‌ను తవ్వేందుకు 14వ కిలోమీటర్ (పంప్‌హౌజ్‌కు) దూరంలో శ్రీపురం వద్ద ప్యాకేజీ 7లో భాగంగా ఏర్పాటు చేసిన ఆడిట్ (ద్వారం) వద్ద నుంచే ఈ భారీ వరద ప్రవేశించింది. దీనితో మొత్తం 20 కిలోమీటర్లకుపైగా టన్నెల్ వరద నీటితో నిండి పోయింది. ఆపై వట్టెం సర్జ్‌ఫూల్.. అక్కడి నుంచి డ్రాఫ్ట్ ట్యూబుల ద్వారా పంప్‌హౌజ్‌లోకి వరద నీరు చేరింది.  

నీటిలో బాహుబలి మోటర్లు

వట్టెం పంప్‌హౌజ్ వద్ద నీటిని ఎత్తిపోసేందుకు మొత్తం 9 మోటర్లను వినియోగిస్తు న్నారు. ఒక్కోటి 145 మెగావాట్ల సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసే బాహుబలి మోట ర్లు. వాస్తవానికి ఆదివారం నాటికి మొత్తం 4 బాహుబలి మోటర్లను పంప్‌హౌజ్‌లో బిగించారు. ఐదో మోటర్ పంప్‌ను బిగించేందుకు సిద్ధంగా ఉంచారు. ఆరో మోటర్‌ను కూడా బిగించడానికి సిద్ధంగా పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పుడు ఆ ఆరు బాహుబలి మోటర్లు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పంపులను ప్రారంభించడానికి ముందే వాటికి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

టన్నెల్‌కు పొంచి ఉన్న ప్రమాదం?

20 కిలోమీటర్ల టన్నెల్‌లో 6 కిలోమీటర్ల పొడవున మాత్రమే సిమెంట్, కాంక్రీట్‌తో లైనింగ్ పూర్తయ్యింది. దీంతో ఇప్పుడు వరద నీటితో నిండిన టన్నెల్‌కు ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైనింగ్ చేయని టన్నెల్‌లో మట్టి కూలే ప్రమాదం ఉందని అంటున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఈ టన్నెల్‌లో ఎక్కువ భాగం గట్టి రాయి ఉందని.. అందువల్ల అది కూలే అవకాశం తక్కువ అని చెప్తున్నారు. కానీ టన్నెల్‌తోపాటు.. సర్జ్‌ఫూల్, పంప్‌హౌజ్‌లో నిండిన వరద నీటిని పూర్తిగా ఎత్తిపోసేనాటికి టన్నెల్‌లో లైనింగ్ లేని ప్రాంతాలు నీటితో తడిసి కుంగిపోయే ప్రమాదం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. 

నిర్లక్ష్యానికి పరాకాష్ట

నిజానికి వర్షాకాలానికి ముందే టన్నెల్‌లోకి ప్రవేశించే ఆడిట్‌లలోకి వరద నీరు రాకుండా రక్షణ గోడలను నిర్మించాల్సి ఉంది. కానీ వట్టెం పంప్‌హౌజ్‌లోకి వరద నీరు ప్రవేశించడానికి కారణమైన శ్రీపురం ప్యాకేజీ 7లోని ఆడిట్ వద్ద తూతూ మంత్రంగా మాత్రమే రక్షణ గోడను నిర్మించారు. నాగర్‌కర్నూల్ మండలం తూడికుర్తి చెరువు అలుగు పారి నాగనూల్ చెరువులోకి వరద పోటెత్తింది. అయినా ప్రాజెక్టు పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థగానీ.. పనులను పర్యవేక్షిస్తున్న నీటిపారుదల శాఖ అధికారులుగానీ స్పందించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగానే భారీ నష్టం వాటిల్లిందని అంటున్నారు.  

భారీ నష్టం

వట్టెం పంప్‌హౌజ్‌లలో ఉపయోగిస్తున్న బాహుబలి మోటర్లు చాలా విలువైనవి. ప్రారంభానికి ముందే అవి నీట మునగటంతో భారీగానే నష్టం సంభవించినట్టు సమాచారం. అయితే నీరు చేరిన సమయంలో అక్కడ సిబ్బంది, కార్మికులు, ఉద్యోగులు ఉన్నారా? అనేది తెలియరాలేదు. మోటర్లతోపాటే విలువైన సామగ్రి, పనిముట్లు, పంప్‌హౌజ్‌లకు సంబంధించిన వస్తువులు కూడా మునిగిపోయాయి. అసలు ఎంతమేర నష్టం జరిగిందనేది అంచనా వేయడానికైనా నీటిని పూర్తిగా తొలగించాల్సిందే.

నీటిని తొలగించటంపై నీటిపారుదల ఈఈ రవీందర్‌ను ‘విజయక్రాంతి’ ప్రశ్నించగా.. 15 రోజుల్లో నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు. వట్టెం పంప్‌హౌజ్ వరద నీటితో మునిగిన విషయాన్ని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన సమాచారం ఇవ్వాలని ప్రాజెక్టు సీఈని  ఆదేశించినట్టు సమాచారం. బుధవారం ఉదయానికల్లా ఈ సంఘటనకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందే అవకాశం ఉందని సమాచారం.

ముందే హెచ్చరించిన‘విజయక్రాంతి

శ్రీపురం ప్యాకేజీలోని 7వ ఆడిట్ నుంచి టన్నెల్‌లోకి భారీగా వరద నీరు వెళుతున్న విషయాన్ని  ‘విజయక్రాంతి’ దినపత్రిక సోమవారమే బహిర్గతపరిచింది. స్థానికులు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్న విషయాన్ని కూడా ప్రచురించింది. టన్నెల్‌లో, పంప్‌హౌజ్ వద్ద కూడా భారీగా పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వరద నీరు లోపలికి వెళితే ఆస్థి నష్టంతోపాటు ప్రాణ నష్టంకూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అయినా అధికారుల్లోగానీ.. కాంట్రాక్టు సంస్థలో గానీ ఎలాంటి చలనం రాలేదు. దీనితో సోమవారం అర్ధరాత్రి వరకే పంప్‌హౌజ్‌లు మొత్తం వరదనీటితో మునిగిపోయింది. నీటి ని మొత్తం తోడితేగానీ ప్రాణనష్టం గురించి చెప్పలేమని స్థానికులు చెప్పటం గమనార్హం.

అధికారులపై చర్యలు తీసుకోవాలి

కరువు నేలను తడిపేందుకు కల్పతరువుగా నిర్మించిన పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉండగానే అధికారుల నిర్లక్ష్యం వల్ల పంపుహౌస్ మునిగిపోయింది. టన్నెల్‌లో ఉన్న నీటిని ఎత్తి పోసి మోట ర్లను కూడా శుద్ధి చేసినప్పటికి మోట ర్ల పనితీరు తగ్గుతుంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్య లు తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.  

 నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి 

నిర్మాణ సంస్థదే బాధ్యత

భారీ వర్షాల ధాటికి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మోటర్ల మునక బాధ్యత పూర్తిగా నిర్మాణ సంస్థదే. ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి వర్షాల కారణంగా టన్నెల్‌లోకి ప్రవేశించిన వర్ష పునీటిని తోడిపోయడం, మోటర్లు తిరిగి యథాస్థితికి తీసుకొచ్చే బాధ్యత నిర్మాణ సంస్థకే ఉంటుంది. 

 చిన్నారెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు