calender_icon.png 11 October, 2024 | 4:56 AM

గోమాతను పూజించే ప్రాంతం సుభిక్షం

11-10-2024 02:57:55 AM

సనాతన ధర్మం కోసం పోరాడేవారికి సంపూర్ణ మద్దతు

గోహింసను అరికట్టి, వాటి సంతతి పెంచాలి

గోమాతను రాష్ట్రమాతగా చేసేందుకే దేశవ్యాప్త పర్యటన 

ఈనెల 26న ఢిల్లీలో విశేష ప్రసంగంలో కేంద్రానికి అల్టిమేటం ఇస్తాం 

జోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ

విజయవాడలో గోధ్వజ్ స్థాపన భారత్ యాత్ర విజయవంతం

విజయవాడ, అక్టోబర్ 10 (విజయక్రాంతి): గోవును ఎక్కడైతే పూజిస్తారో.. ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుందని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ పేర్కొన్నారు.

గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న స్వామిజీ గురువారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని సత్యనారాయణపురం బీఆర్‌టీఎస్ రోడ్‌లో ఉన్న శ్రీ శృంగేరీ శారదా పీఠ మహాసంస్థానంలోని శ్రీ శివరామ కృష్ణ క్షేత్రంలో గోధ్వజ్‌ను స్థాపించారు. గోపూజ సహా ఇతర కార్యక్రమాలకు హాజరై ప్రసంగించారు. అనంతరం గో రక్షకులకు స్వామిజీ సేవా సర్టిఫెకెట్లను అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ మొదటిగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, గో సేవకులు విజయలక్ష్మి, నందకిశోర్, గోపి, భాస్కర్ స్వామిజీకి మంగళహారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం నందిగామ నియోజకవర్గం గో సేవకులు, భక్తులు కల్పన, వల్లి, నిహాంత్, సాయి మణి, కృష్ణస్వామి వారిని ఘనంగా స్వాగతించారు.

ఆ తర్వాత శృంగేరి పీఠంలో స్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామివారు గో సేవకులకు, భక్తులకు, మరియు వారి శిష్యులకు గోమాత విశిష్టతను వివరించారు. గోమాతను రాష్ర్ట మాతగా, దేశమాతగా ప్రతీ రాష్ర్ట ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని తద్వారా గోహింసను అరికట్టాలని గోవుల సంతతిని పెంచాలని తెలిపారు.  

రాష్ట్రాల సుముఖత.. 

శృంగేరీ శారదా పీఠ మహా సంస్థానంలో స్వామిజీ భక్తులను ఉద్ధేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోవును రాజమాతగా ఆమోదించిందని, తదుపరి రాష్ట్రాలు కూడా ఆమోదానికి సుముఖంగా ఉన్నాయని తెలిపారు. గోవును రాష్ర్టమాతను చేసేందుకు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకే భారతదేశ యాత్రను చేపట్టామన్నారు.

రాష్ట్రాల్లో పర్యటిస్తూ గోవును రాజమాతగా ఆమోదించించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నామని చెప్పారు. యాత్రకు గుర్తుగా ధ్వజ స్థంభాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోవులను సంరక్షించేలాగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతీ రాష్ర్టంలో పర్యటిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్వామిజీ తదుపరి యాత్ర తమిళనాడు రాష్ట్రంలో చేపట్టనున్నారు.

సనాతన ధర్మం కోసం పోరాడేవారికి అండ..

భారతదేశ సనాతన ధర్మం ప్రపంచానికి వెలుగు చూపిందని స్వామీజీ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం తగదన్నారు. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యం లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సనాతన ధర్మంపై స్పందించారని, ధర్మం కోసం పోరాడే ప్రతీ ఒక్కరికి తమ ఆశీస్సులు ఉంటాయని అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ తెలిపారు.

కార్యక్రమంలో విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, ఆంధ్రప్రదేశ్ స్వాగత కమిటీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య, గోరక్షకులు గార్లపాటి విజయకుమార్, వారణాసి దుర్గా సారథి, సురేశ్ కుమార్, తేజ్‌రాజ్, అరుణ్, టీ రవీంద్రబాబు, కే సత్యనారాయణ, వందేమాతరం అశోక్, సీతారామయ్య, బన్సీలాల్, గణేశ్, శ్రీమన్నారాయణ, భరద్వాజ్ శర్మ, జీవీ హనుమంతరావు, పీవీ ఫణి కుమార్, ప్రకాశ్ నందిరాజు, బాలాజీ ప్రసాద్, విశాన్ సింగ్, కార్తీక్ శర్మ, కేవీ సుబ్రహ్మణ్యం, టీ సూర్యనారాయణ మూర్తి, రాజేంద్రప్రసాద్, వినోద్ కుమార్, బీవీ బాలకోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

కేంద్రానికి అల్టిమేటం

గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా ఈనెల 26న దేశ రాజధాని ఢిల్లీలో విశేష ప్రసం గం చేస్తామని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిజీ వెల్లడించారు. ఈ ప్రసంగం అనంతరం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించే విషయమై కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామని స్వామీజి తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై స్వామిజీ స్పందిస్తూ.. కల్తీ సమస్యను అధిగమించడానికి స్వయం ప్రతిపత్తితో గోశాలలను ఏర్పరచుకొని తద్వారా స్వచ్ఛమైన నేతితో తయారు చేయాలని, తద్వా రా ఎలాంటి వివాదానికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.