calender_icon.png 27 February, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శుభానందా దేవి ముక్తేశ్వర్ స్వామి కళ్యాణ మహోత్సవం

26-02-2025 09:20:38 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): దక్షిణ కాశిగా పేరుపొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో శుభ ఆనంద దేవి ముక్తేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మా శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులతో సందడి నెలకుంది. మహాశివరాత్రి పర్వదినం కావడంతో ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్  వంటి జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలను, గోదావరిలో గోదావరి మాతకు సైకత లింగలకు పూజలు చేశారు. ఆలయంకు చేరుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయం అధికారులు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కాళేశ్వర క్షేత్రంలో మంగళవారం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఉదయం 10-00 గం॥లకు మంగళవాయిధ్యాలతో దీపారాధన,  గణపతి పూజ,  స్వస్తి పుణ్యాహవచనం రక్షాబంధనం, దీక్షా వస్త్రధారణ రుత్విగ్వరణం మృత్సంగ్రహణము, దేవతారాధన నవకలశారాధన, నవగ్రహారాధనము, మండప దేవతారాధన, వృషభ ధ్వజారోహణం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 4-00 గం॥లకు: అగ్ని ప్రతిష్ఠ రుద్రహవనము. రాత్రి 08-00 గం॥లకు : ఊరేగింపు, ఎదురుకోలు సేవ రాత్రి 08-30 గం॥లకు ప్రసిద్ధ కళాకారులచే భక్తి సంగీత కార్యక్రమములు జరిగాయి.  ప్రధానంగా బుధవారం శివరాత్రి మహోత్సవం రోజు భక్తుల రద్దీ నెలకొంటుంది.

సాయంత్రం 4-35 గం॥లకు శ్రవణా నక్షత్రయుక్త కర్కాటకలగ్న మందు శ్రీ ముక్తీశ్వర శుభానందలకు కళ్యాణ మహోత్సవము, అక్షతారోపణము చేశారు. రాత్రి 12-00 గం॥లకు ఋత్వికులు లింగోద్భవ పూజ, అనంతరం చండి, కాళరాత్రి హోమము నిర్వహించనున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు రవాణా, తాగునీటి సౌకర్యం, అత్యవస వైద్య సేవలు, ప్రత్యేక పారిశుధ్య చేపట్టారు. మిషన్ భగీరథ శాఖ ద్వారా మరియు మహదేవ్పూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా భక్తులకు అందించారు. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శీను బాబు ట్రస్టు తరపున భక్తులకు మజ్జిగ పాకెట్లు పంచిపెట్టారు. శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని పెద్దపెల్లి ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి  మహేష్, ఆలయ ప్రధాన అర్చకులు త్రిపురా రీ కృష్ణమూర్తి, ఉప ప్రధాన అర్చకులు నగేష్ శర్మ, వేద పండితులు, అర్చకులు, ఆలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.