శ్రమ, పట్టుదల, తెలివితేటలతో మనం చేయలేని పని అంటూ ఉండదు. వీటికి వివేకం తోడైతే అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. ఒక కవి మరొక కవిని తయారు చేసినట్లు, ఓ విద్వాంసుడు శిష్యుణ్ణి పండితునిగా తీర్చిదిద్దినట్లు, ఒక యోగి సాధకుణ్ణి యోగ పారంగతునిగా మార్చినట్లు.. ఒక బ్రహ్మవేత్త అయిన పురోహితుడు మరొక సాధారణ వ్యక్తిని తన వంటి పురోహితుణ్ణి చేయగలడు కూడా. మా ఊరి మాస్టారు, గ్రామ పురోహితుడు సుబ్బయ్య పంతులు దీనినే సాధించాడు.
తెలుగు సాహిత్యంలో ‘సుమతీ శతకం’ అత్యంత ప్రశస్తి కలిగింది. ఇందులోని పద్యాలన్నీ ఇంచుమించుగా వేదానుకూలమైనవి.
‘అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు యేరున్, ద్విజుడన్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ’
నాకు ఈ పద్యం బాల్యంలోనే కంఠస్తమైంది. ఎలాంటి గ్రామంలో వుంటే మనిషికి లాభమో ఈ పద్యం చెబుతున్నది. అవసరానికి అప్పివ్వగలిగిన ధనికులు, అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించే వైద్యులు, ఆహారోత్పత్తికి కారణమై దాహం తీర్చగలిగిన చెఱవుతో విలసిల్లే గ్రామం ఎంత గొప్పదో, మంచి చెడ్డలను వివేచించి, కర్తవ్యోపదేశం చేయగలిగిన పురోహితుడు కూడా గ్రామానికి అంతే అవసరం.
సుబ్బయ్య పంతులుకు తోచిన ఆలోచన లోకోత్తరమైంది. అందరినీ ప్రేమించే ఆయన దృష్టికి యాదయ్య అనే యువకుడు రావడం విశేషం. అతడు వడ్రంగి. కానీ, దైవ భక్తుడు. పాటలు అల్లగలడు, కీర్తనలు పాడగలడు. నియమనిష్ఠలు కలిగిన వ్యక్తిగా ఊళ్లో అందరికీ తెలిసినవాడు. కొంచెం శిక్షణ ఇస్తే అతడు శివాలయంలో పూజారిగా ఉండగలడు.
మా ఊరుతో నాకు గల అనుబంధం కన్నతల్లితోగల అనుబంధం లాంటిది. ఐదవ తరగతి వరకే మా ఊళ్లో చదువుకున్నాను. నేను చదువుకున్న పాఠశాల ఒక పాకశాలలో ఉండేది. అది మా ఊరి ఏకైక పురోహితుడైన మురుకుంట్ల వెంకట సుబ్బయ్య పంతులు ఇంటికి అభిముఖంగా ఉంటుంది. వెంకట సుబ్బయ్య ఆ పాఠశాలను ప్రారంభించి గ్రామస్థులకు విద్యాదానం చేశాడు. తర్వాతి కాలంలో ఆ పాఠశాల గ్రామ పంచాయతీ ఆధీనంలోకి వచ్చింది. విద్యావంతుడైన వెంకట సుబ్బయ్య అప్పుడప్పుడు గమనిస్తూ ఉండడం వల్ల ఉపాధ్యాయులు కూడా పిల్లలకు చక్కగా చదువు చెప్పగలిగారు.
అప్పిచ్చే సంపన్నుడు, వైద్యుడు ఏ విధంగా గ్రామ సంరక్షణతో భాగస్వాములయ్యారో, అదే విధంగా వెంకట సుబ్బయ్య కూడా గ్రామానికి పెద్ద దిక్కయ్యారు. నాకు తెలిసినంత వరకు ఆయన అబద్ధమా డలేదు. గ్రామ ప్రజలందరి బాగోగులు తెలుసుకోవడమేగాక వారికి తగిన సూచనలు కూడా ఇచ్చేవాడు. స్వయంగా వ్యవసాయం చేసేవాడు. అప్పటికి నేను నాల్గవ తరగతిలో ఉన్నాను.
మాకు లలిత్ సింగ్ అనే వ్యక్తి హెడ్‌మాస్టర్‌గా వచ్చారు. పాఠశాలలోనే ఒక గదిలో ఆయన ఒక్కరే నివాసం ఉండేవారు. వంట స్వయంగా చేసుకునే వారు. సుబ్బయ్య మా హెడ్‌మాస్టర్‌ని స్కూల్ గదిలో కాకుండా తన ఇంట్లోని ఒక గదిలో ఉండమని కోరారు. లలిత్ సింగ్ దానికి ఒప్పుకోలేదు. క్లాసులు జరుగుతున్నప్పుడు ఒక్కోసారి ఆయన వంట చేసుకోవడం వల్ల పొగ వచ్చి, పిల్లలకు అసౌకర్యంగా ఉండేది. ఉతికిన బట్టల్ని పై కప్పు నుంచి వ్రేలాడదీయడంతో పిల్లలకు సరిగా సూర్యకాంతి అందేది కాదు. పైపెచ్చు “నేను హెడ్‌మాస్టర్‌ను, ఎవరేం చేస్తారు?” అనే ధోరణితో మెదిలేవారు. పిల్లలకు అందాల్సిన మధ్యాహ్న భోజనం కూడా అందకుండా చేసేవారు. ఆయన పాల పొడిని అమ్ముకోవడం స్వయంగా చూసిన సుబ్బయ్య హెడ్‌మాస్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేయించాలనుకున్నారు.
నాతోనే ఒక అప్లికేషన్ రాయించారు. కింద నా సంతకంతోనే మండల కేంద్రానికి పంపారు. సుబ్బయ్య చొరవ వల్లనే ఆ హెడ్‌మాస్టర్ కొల్కులపల్లి నుంచి బదిలీ అయ్యా రు. కానీ, దానికి ‘నేనే కారణమని’ భావించిన ఆ హెడ్మాస్టర్, నా చేతులు చాపించి రూలర్‌తో నన్ను కొట్టిన సంఘటన నాకిప్పటికీ గుర్తు. ఎలాగైతేనేం, ఈ రకంగా ఆయన బడి సమస్యను తొలగించారు.
బడి తర్వాత బాగైన గుడి..
నేను ఎప్పుడు గ్రామానికి వెళ్లినా సుబ్బయ్యని కలవకుండా హైద్రాబాద్‌కు వచ్చేవాణ్ణి కాదు. మా నాన్నని నేను ‘అయ్య’ అని సంబోధిస్తే, సుబ్బయ్య పంతులుని ‘అయ్యగారూ’ అని పిలిచేవాణ్ణి. నా విద్యాభివృద్ధి విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, నన్నభినం దించిన మహాపురుషుడు సుబ్బయ్య. అటువంటి సుబ్బయ్య పంతులుకి ఒక మంచి సంకల్పం కలిగింది. మా ఊళ్లో శిథిలావస్థలో ఉన్న ప్రధాన ఆలయాన్ని పునరుద్ధరించాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా గ్రామపెద్దలను, ఊళ్లోని ప్రముఖులను సమావేశ పరిచారు. దేవాలయోద్ధరణకు విరాళాలు సేకరించాలని విజ్ఞప్తి చేశారు. సుబ్బయ్య చెబితే వినని వారు ఆ గ్రామంలో లేరు. గ్రామస్థుల ఇళ్లల్లో ఏ కార్యక్రమం జరిగినా తారతమ్యం పాటించకుండా ఆయన వెళ్లేవారు. ‘పురోహితుడంటే ఇట్లా ఉండాలి’ అనే అభిప్రాయం ఆయనపట్ల నాకు కలిగింది.
సుబ్బయ్య పంతులు బ్రాహ్మణుడైనప్పటికినీ కులభేదాలను పాటించేవారు కారు. అందరినీ ప్రేమించేవారు. పౌరోహిత్యం చేయనని ఎన్నడూ ఎవరికీ చెప్పలేదు. అందుకే, సుబ్బయ్యని అందరూ గౌరవిస్తారు. దేవాలయోద్ధరణ కార్యక్రమాన్ని సంకల్పించిన ఆయనకి గ్రామంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. లక్షల రూపాయలు వసూలయ్యాయి. ఒక్క పైసకూడా లెక్క తప్పకుండా, వ్యర్థం కాకుండా చూసే బాధ్యత వారిదే. అలా కొంతవరకు ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఊళ్లోని ఆ ప్రధాన ఆలయం శివాలయం. అప్పటి వరకు అది శిథిలావస్థలో ఉన్నందువల్ల పూజలు కూడా జరగలేదు.
నాకు శివభక్తి ఎక్కువ. గ్రామానికి వచ్చినప్పుడల్లా దేవాలయ పూజారి వ్యవస్థ గురించే సుబ్బయ్య పంతులుతో మాట్లాడేవాణ్ణి. సామాజిక సమానత్వం అంటే నాకెంత ఇష్టమో వారికి కూడా అంతే ఇష్టం. ఆయన నిజమైన సామాజికుడు. తాను వృద్ధులయ్యారు. వారి పిల్లలు హైదరాబాదులో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి, పునరుద్ధరణ పూర్తయిన ఆలయానికి పూజారులుగా ఎవరుండాలి? సుబ్బయ్యతో ఈ విషయమై నేను చర్చించాను.
ఈ సందర్భంగా సుబ్బయ్య పంతులుకు తోచిన ఆలోచన లోకోత్తరమైంది. అందరినీ ప్రేమించే ఆయన దృష్టికి యాదయ్య అనే యువకుడు రావడం విశేషం. అతడు వడ్రంగి. కానీ, దైవ భక్తుడు. పాటలు అల్లగలడు, కీర్తనలు పాడగలడు. నియమ నిష్ఠలు కలిగిన వ్యక్తిగా ఊళ్లో అందరికీ తెలిసినవాడు. కొంచెం శిక్షణ ఇస్తే అతడు శివాలయంలో పూజారిగా ఉండగలడు.
ఈ ఆలోచన రాగానే సుబ్బయ్య అతణ్ణి ఊర్లో ఉన్న తన ఇంటికి పిల్చారు. అతనికి ఒక నెల రోజులపాటు పూజా విధానాన్ని బోధించాడు. గ్రహణశక్తిగల యాదయ్య.. సుబ్బయ్య చెప్పినట్లు ఆహార నియమాలు పాటించడమేగాక పూజా విధానాన్నీ అలవర్చుకున్నాడు. అలా మెరుగైన ఆ శివాలయంలో యాదయ్య పూజారిగా నియమితులైనాడు. గ్రామానికి పురోహితుడు లేని లోటు తీరింది. సుబ్బయ్య పంతులు వివేకం, ఔదార్యానికి నేను మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేశాను.
వ్యాసకర్త సెల్: 9885654381