14-03-2025 11:58:52 PM
సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మలా పోరాడాలి
సగర మహిళా దినోత్సవ సభలో జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్,(విజయక్రాంతి): మహిళా సాధికారత సాధించాలంటే మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్(BC Welfare Association National President Jajula Srinivas Goud) అన్నారు. నగరంలోని రెడ్‌హిల్స్ ఎఫ్‌టీసీసీఐలో తెలంగాణ సగర మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి అధ్యక్షతన శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాజుల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ 5శాతం ఉన్న అగ్రవర్ణ మహిళలు 54 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే బీసీలు ఎనిమిది మందే ఎన్నిక కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళా సబ్ కోటా కోసం మహిళలంతా సమ్మక్కసారలమ్మ, చాకలి ఐలమ్మలా పోరాడాలని పిలుపునిచ్చారు. విశిష్ఠ అతిథిగా విచ్చేసిన బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో , పురుషులతో సమానంగా రాణించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. భగీరథుని వారసులుగా సగర జాతి ఔన్నత్యం కోసం సగర మహిళలు చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గెజిటెడ్ హోదాల్లో పని చేస్తున్న సగర మహిళా అధికారులు, స్వచ్ఛంద సేవ చేస్తున్న మహిళలను సత్కరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కొత్తగూడెం జిల్లా దమ్మపేట వాసి పెరుమళ్ల మహాలక్ష్మయ్య కుటుంబానికి సగర సంఘం సభ్యత్వ బీమా కింద రూ.2లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సగర సంఘం రాష్ట్ర అధ్యక్షడు ఉప్పరి శేఖర్, గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్, ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం, కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి, మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్‌ప్రెసిడెంట్ తంగడపల్లి పల్లవి, ప్రధానకార్యదర్శి అతినారపు విజయలక్ష్మి, కోశాధికారి సూర జయమ్మ, బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు మణిమంజరి, తదితరులు పాల్గొన్నారు.