calender_icon.png 16 October, 2024 | 6:31 PM

ఆదర్శ పాఠశాలను సందర్శించిన సబ్ కలెక్టర్

16-10-2024 04:13:09 PM

మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలంటూ ఆదేశాలు 

నిజాంసాగర్: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మైయి కొప్పిశెట్టి బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు తరగతి గదులలో  పర్యటించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు తయారుచేసిన పలు మేధాశక్తికి సంబంధించిన గ్యాలరీను తిలకించి అభినందించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాల్సి ఉండగా మెనూ పాటించడం లేదని మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై మండిపడ్డారు.

అనంతరం అచ్చంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులతో మాట్లాడారు. ఐదుగురు లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం అందజేసిన పది లక్షల రూపాయల యూనిట్ను సద్వినియోగం చేసుకున్నారా దళారులు ఎవరైనా ఏమైనా డబ్బులు తీసుకున్నారా అంటూ వారిని అడగగా అలాంటిది ఏమీ లేదని 10 లక్షలను తాము సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. తహసీల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులో గోల్బంగ్లా సమీపంలో సర్వే నంబర్ 121లో  టూరిజం కోసం ఇటీవల నాలుగు ఎకరాల భూమిని కేటాయించడంతో అట్టి భూమిని ఆమె పరిశీలించారు. నిజాంసాగర్ ప్రాజెక్టును టూరిజంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని టూరిజం కోసం కేటాయించిన నాలుగు ఎకరాలు అణువుగా ఉందని ఆమె అన్నారు. ఆమె వెంట తహసిల్దార్ బిక్షపతి  ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంజయ్య, సర్వేయర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.