calender_icon.png 21 November, 2024 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఉపకులాలను మాల, మాదిగ కులాలతో కలపొద్దు

27-08-2024 06:28:31 PM

దళితుల్లో కులగనన చేపట్టిన తర్వాతే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి

దళితుల్లో అత్యంత వెనుకబడ్డ ఉపకులాలను "ఏ"లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి

ఉపకులాలకు అన్యాయం చేస్తే మరోపోరాటానికి సిద్ధం

ఎస్సీ వర్గీకరణ అమలుపై విధి విధానాలు రూపొందించుటకు వెంటనే రిటైర్డ్ జడ్జితో కమిషన్ ను ఏర్పాటు చేయాలి

ఉపకులాల కార్పొరేషన్ ఏర్పా టు చేసి నిధులు కేటాయించాలి

ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయిల లక్ష్మి నర్సయ్య చిందు డిమాండ్ 

జగిత్యాల, (విజయ క్రాంతి): కులగనన తరువాతే శాస్త్రియంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని , ఉపకులాలకు అన్యాయం చేయాలని చూస్తే మరో పోరాటానికి సిద్దమని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి   ఉపాధ్యక్షులు రాయిల లక్ష్మి నర్సయ్య చిందు అన్నారు. ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం  ఆదేశాల మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాదిగలు, ఉపకులాల సుధీర్ఘ పోరాటం వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వెంటనే ఎస్సీ వర్గీకరణ ను అమలుచేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అన్నీ రంగాలలో దళితుల్లో అన్యాయానికి గురైన కులాల పక్కా సమాచారం తీసుకున్న తరువాతే వర్గీకరణ చేయాలని సూచించింది. కాబట్టి  దళితుల్లో కులగనన చేపట్టిన తర్వాతే శాస్త్రియంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని ఇందుకోసం వెంటనే రిటైర్డ్ జడ్జ్ తో ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

వర్గీకరణ డిమాండ్ తెరమీదకు వచ్చిందే ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వారి వాటా వారికి దక్కడం కోసం. కానీ గత ఉమ్మడి రాష్ట్రం లో అమలు జరిగిన ఎస్సీ వర్గీకరణ వల్ల మాల, మాదిగ గ్రూపులలో చేర్చబడిన ఉపకులాలు అన్ని రంగాలలో తీవ్రంగా నష్ట పోయారని గతంలో ఏర్పాటు చేసిన రామచంద్ర రాజు, ఉషామేహరా, లోకూర్ కమిషన్లు స్పష్టంగా తెలుపుతూ ఉపకులాల అభివృద్ధి కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వలకు నివేదికలిచ్చారని అన్నారు. సుధీర్ఘ పోరాటం తరువాత ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు పచ్చ జండా ఊపిందని, కొంతమంది చేసే తప్పుడు ప్రచారాన్ని, రాజకీయ వొత్తిడిని పట్టించుకోకుండా, దళితుల్లో కులగనన చేపట్టి ఇన్నేళ్లుగా అభివృద్ధి ఫలాలకు దూరమైన ఈ కులాలకు సామాజిక వెనుకబాటు తనం ఆధారంగా  రిజర్వేషన్ వాటా కేటాయించి శాస్త్రియంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్నారు.

మన రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 59 దళిత కులాల  జనాభా 63 లక్షలు కాగా అందులో మాల ,మాదిగ కాకుండా మిగిలిన 57  ఉపకులాల వాస్తవ జనాభా ముప్పై లక్షలవరకు ఉంటుందని, గతంలో జరిగిన జనాభా జనాభా లెక్కల్లో ఉపకులాల వారిగా కాకుండా కేవలం ఎస్సీలుగా మాత్రమే లక్షలాది మంది ఉపకులాలను లెక్కించ్చారని. ఉపకులాలకు కులధ్రువీకరణ పత్రాలను ఆర్డీవో ద్వారా ఇస్తుండడం వల్ల అనేక ఇబ్బందులకు గురై విధిలేక వీరు మాల, మాదిగ కుల పత్రాలను పొందడం వల్ల మాల మాదిగ కుల జనాభా పెరిగిందని కాబట్టి వెంటనే ఉపకులాలందరికి కులపత్రాల ను ఆర్డీవో పరిధినుండి తొలగించి తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారనికి దళితుల్లో ప్రత్యేక ఆంత్రోపాలాజికల్ సర్వే నిర్వహించి ఎవరికులానికి చెందిన కులస్థులకు వారి కులపత్రాలు ఇవ్వాలని అన్నారు. అనంతరం కులగనన చేపట్టి ఎవరి వాటా వారికి దక్కేలా కృషి చేయాలన్నారు. కాగా కొంతమంది మాల మాదిగ కులాలే అధికంగా ఉండి మిగతా కులాలు ఒక్కశాతం కూడా లేరనే తప్పుడు ప్రచారం చేస్తూ ఎస్సీ వర్గీకరణ అంశం కేవలం మాల మాదిగల పంచాయతీ గా చిత్రికరించి మిగతా 57 ఉపకులాలను అణిచివేసే కుట్ర జరుగుతుందన్నారు. 

 గత ఎన్నికల్లో ఎస్సీ ఉపకులాల పోరాటాన్ని ఆనాటి పీసీసీ అధ్యక్షులు నేటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో మాల, మాదిగలతో పాటు ఎస్సీ ఉపకులాలకు కూడా మూడు ప్రత్యేక కార్పొరేషన్ లు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ ప్రసంగంలో మాల మాదిగలకు కార్పొరేషన్ లను ప్రకటించి ఉపకులాల కార్పొరేషన్ ను విస్మరించడం ఎవరి కుట్రనో తేల్చలన్నారు. ఇప్పటికైనా ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ సజావుగా అమలుచేయుటకు, విధివిధానాలు ఖరారు చేయుటకు వెంటనే రిటైర్డ్ జడ్జి తో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకులు జిల్లా నాయకులు గడ్డం మధు చిందు తదితరులు పాల్గొన్నారు.