ఏబీవీపీ నేతలపై లాఠీచార్జ్, అరెస్టు
కరీంనగర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కరీంనగర్ శాతవాహన యూనివ ర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని, ఎగ్జామినేషన్ బ్రాంచిలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు మంగళవారం ఎస్‌యూ ముట్టడికి యత్నించారు. ప్రధాన గేట్ మీదుగా యూనివర్సిటీలోకి ప్రవేశించేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, రాష్ట్ర కార్యసమితి సభ్యుడు జెల్లపెల్లి అంజన్న మాట్లాడుతూ.. ఎస్‌యూలో అనేక సమస్యలున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా రెగ్యులర్ వీసీని నియమించలేదన్నారు. యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో అనేకరకాల అవకతవకలతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పంది ంచి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించి నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన హాస్టిల్ వసతి కల్పించాలని, పీహెచ్‌డీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.