calender_icon.png 17 October, 2024 | 3:53 AM

తప్పుడు కుల ధ్రువీకరణతో చదువు

17-10-2024 02:18:15 AM

కుమారుడి ఎంబీబీఎస్ కోసం డిప్యూటీ డీఎంహెచ్‌వో నిర్వాకం

కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసిన కలెక్టర్

సూర్యాపేట, అక్టోబర్ 16: కుమారుడికి ఎంబీబీఎస్‌లో సీటు ఇప్పించేందుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించగా.. దానిని రద్దు చేస్తూ  సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సూర్యాపేటకు డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పని చేసిన కర్పూరపు హర్షవర్ధన్ బీసీ (సాతాని) కులానికి చెందిన వ్యక్తి. ఎస్సీ కులానికి చెందిన అరుణజ్యోతిని గతంలో వివాహం చేసుకున్నారు.

వీరికి ప్రణవ్‌వర్ధన్, ప్రత్యూష్‌వర్ధన్ ఇద్దరు కుమారులు. మనస్పర్థల కారణంగా హర్షవర్ధన్, అరుణజ్యోతి విడిపోయారు. కుమారులిద్దరూ తండ్రి వద్దే ఉంటూ చదువుకుంటు న్నారు. అయితే 2018 వరకు పాఠశాల రికార్డ్‌ల్లో బీసీ కేటగిరీకి చెందిన వారిగా నమోదు కాగా 2019లో తప్పుడు కుల సర్టిఫికెట్ ఆధారంగా ఎస్సీ మాలగా మార్పు చేయించారు.

ఈ సర్టిఫికెట్ ఆధారంగానే నార్కెట్‌పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో ఎస్సీ కోటాలో పెద్ద కుమారుడు ఎంబీబీఎస్ సీటు సంపాదించాడు. దీనిపై ఎస్సీ ఐక్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండమల్ల మల్లేష్ ఫిర్యాదు చేయడంతో చైర్మన్‌గా అదనపు కలెక్టర్, సభ్యులుగా జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్ అధికారులను చేర్చి కలెక్టర్ ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయించారు.

ఈ విచారణలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు తేలడంతో కలెక్టర్ దానిని రద్దు చేస్తూ గెజిట్‌ను విడుదల చేశారు. దీనిపై అభ్యంతారులు ఉంటే 30 రోజుల్లోగా కోర్టుకు వెళ్లవచ్చిన పేర్కొన్నారు. కాగా ఇదే డిప్యూటీ డీఎంహెచ్‌వో గతంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా ఉన్న సమయంలో పెన్‌పహాడ్ పీహెచ్‌సీలో నిధుల అవకతవకలపై సస్పెండ్ అయ్యారు.