03-04-2025 08:40:30 PM
మండల విద్యాధికారి దత్తు మూర్తి..
మందమర్రి (విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని తద్వారా పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మండల విద్యాధికారి కే దత్తు మూర్తి కోరారు. మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గురువారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నీమ్ మాట్లాడుతూ... పట్టణంలోని ఆదర్శ పాఠశాల జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాదిస్తు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఉపాధ్యాయుల ఉత్తమ విద్య బోధనతో ఇంటర్మీడియట్ 10వ తరగతిలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్నత ఫలితాలు సాధించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బోధన, తల్లితండ్రుల ప్రోత్సాహంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పాఠశాల విద్యార్థులు క్రీడలు ఇతర రంగాలలో రాణిస్తున్నారని విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కోచ్ లు, పిఈటి లను ప్రత్యేకంగా అభినందించారు. 2023-24 సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాలలో ముగ్గురు 10/10 జిపిఏ, 38 మంది విద్యార్థులు 9 జిపిఏతో 100 శాతం ఉత్తీర్ణత సాధించామని, 2024-25 లో 60 శాతానికి పైగా 9 జిపిఏ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పి శ్రీనివాస్, ఏఎస్ఒ రాజ్ కుమార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.