- ప్రత్యేక తరగతుల పేరిట ‘శిక్ష’ణ
- అల్పాహారం లేక అవస్థలు
- దాతల కోసం ఎదురుచూపులు
సిరిసిల్ల, నవంబర్ 29(విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులు పస్తులతో వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ‘పది’లో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ ప్రత్యేక ఈ నెల 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసింది. ఉదయాన్నే పాఠశాలకు వస్తున్న విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయం వరకు ఖాళీ కడుపుతోనే చదవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
అల్పాహారానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపో వడంతో అధికారులు ఏర్పాట్లు చేయడం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ అల్పాహారం పథకం పేరిట ప్రారంభించి ఆదిలోనే వదిలేశారు. కొత్తగా ఏర్పడిన ప్ర భుత్వం అల్పాహారం ఏర్పాటు చేస్తుందని ఎదురుచూసిన విద్యార్థులకు నిరాశే మిగిలింది.
ఆరువేలకు పైగా విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా ఆరువేలకు పైగా విద్యార్థులు ‘పది’ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 1 నుంచి పాఠశాలల్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటి నుంచి 7.30 గంటలకు వెళ్లిన విద్యార్థులు ప్రత్యేక తరగతులు విని మధ్యాహ్నం భోజనం చేస్తారు. 4.15 గంటలకు పాఠశాల పూర్తయ్యాక 5.15 గంటల వరకు మళ్లీ ప్రత్యేక క్లాసులు వినాల్సి ఉంటుంది.
ఇలా ప్రతి రోజూ అర్ధాకలితో విద్యను అభ్యస్తున్న తమకు చదువు ఎక్కడం లేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 109 జెడ్పీ హైస్కూల్స్, 13 కేజీబీవీలు, టీఎస్‌ఎంసీ 7, ఒక కేంద్రీయ విద్యాలయం ఉన్నాయి. ఇందులో 6,918 మంది పదో తరగతి విద్యార్థులు.. బాలురు 3,186, బాలికలు 3,732 మంది ఉన్నారు.
దాతల కోసం ఎదురుచూపులు
ప్రత్యేక తరగతులు ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులు అల్పాహారం లేక అలమటిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు అధికారులు ‘శిక్ష’ణ ఇస్తున్నారే తప్పా.. వారి ఆకలిని తీర్చడంపై దృష్టి సారించడం లేదు. గతంలో అల్వాహారం కోసం స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకులు, ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, విద్యార్థులు తల్లిదండ్రులు విరాళాలు ఇచ్చేవారు.
దీంతో విద్యార్థులు ఉదయం, సాయంత్రం అల్పాహారం తిని మంచిగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించారు. కానీ ప్రత్యేక తరగతులు ప్రారంభమై నెల గడుస్తున్నా.. అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడంతో విద్యార్థులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు అల్పాహారం కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు రావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.