calender_icon.png 9 January, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలవరం ప్రభావంపై అధ్యయనం

05-01-2025 01:43:20 AM

  1. హైదరాబాద్ ఐఐటీ బృందంతో చేయించండి
  2. నీటిపారుదల శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
  3. ఏపీ కొత్తగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకూ అనుమతుల్లేవు
  4. ముఖ్యమంత్రికి తెలిపిన నీటి పారుదల శాఖ అధికారులు
  5. ఏపీ చీఫ్ సెక్రెటరీకి అభ్యంతరం తెలపాలన్న సీఎం  

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందంతో అధ్యయనం చేయించి, నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం సీఎం రేవంత్‌రెడ్డి సాగునీటిపారుదల శాఖపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల శాఖ) ఆదిత్యనాథ్ దాస్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ బృందం సమగ్ర నివేదికను నెలరోజుల్లో తయారుచేయాలని ఆదే శించారు. హైదరాబాద్ ఐఐటీ బృందంతో సమన్వయం చేయడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం సూచించారు.

భద్రాచలం ఆలయానికి ముప్పు 

పోలవరంతో భద్రాచలం రామా లయా నికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురయ్యిం దని సీఎంకు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలోనే పోలవరంతో తెలంగాణపై ఎంతమేర ప్రభా వం ఉంటుందనేది శాస్త్రీయంగా తెలుసుకోవడానికి హైదరాబాద్ ఐఐటీ బృందంతో అధ్యయనం చేయించి, నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు.

బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవు

ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు గురించి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిందని వివరించారు. వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని సీఎంకు తెలిపారు.

దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి.. బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అభ్యంతరాలను తెలపాలని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు సూచిం చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు తోపాటు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని అధికారులను సీఎం ఆదేశించారు.