- నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ
- వారంలో నివేదిక ఇవ్వాలి
- మేజర్, మైనర్ ఖనిజ విధానంపైనా అధ్యయనం
- గనులశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ర్టంలో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాతోపాటు గనుల శాఖపై మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇసుక సరఫరాపై అధ్యయనానికి ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనులశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్‌కుమార్‌తో కమిటీని ప్రకటించారు.
వారంలోపు నివేదికను సమర్పించాలని సీఎం ఆదేశించారు. రాష్ర్టంలో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక నుంచి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావడం లేదని సీఎం పేర్కొన్నారు. అదే సమయంలో వినియోగదారులు ఎక్కువ ధరకే ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక దక్కేలా చూడాలని..
అదే సమయంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని ఆదేశించారు. మేజర్, మైనర్ ఖనిజాల గనులకు వేసిన జరిమానాలు వసూళ్లు కాకపోవడంపైనా ఆరా తీశారు. మేజర్, మైనర్ ఖనిజ విధానంపై కూడా సమగ్ర అధ్యయనం చేసి రెండు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించారు.
ఈ అధ్యయనం కూడా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కూడిన కమిటీనే చేయనుంది. సమీక్షలో గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్యకార్యదర్శి వీ శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్ పాల్గొన్నారు.