calender_icon.png 23 January, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటపాటలతో అంగన్‌వాడీ చదువు

05-07-2024 12:30:09 AM

  1. పూర్వ ప్రాథమిక విద్యపై ప్రభుత్వం దృష్టి 
  2. ప్రత్యేక పుస్తకాల సరఫరా 
  3. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాం 
  4. ఇప్పటికే టీచర్లకు శిక్షణ పూర్తి 

వికారాబాద్, జూలై 4 (విజయక్రాంతి): అంగన్‌వాడీ స్థాయిలోనే చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆటపాటలతో కూడిన విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తూ బొమ్మలు, పాటల రూపంలో విద్యను బోధిస్తున్నారు. ఈ ఏడాది నుంచి పాఠ్యపుస్తకాల ద్వారా విద్యా బోధన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో అంగన్‌వాడీ విద్యార్థుల కోసం కొత్తరకం పాఠ్యప్తుసకాలను రూపొందించారు. ఇందులో వారంలో ఏమేమీ బోధించాలి, ఏ నెలలో ఏయే పాఠ్యాంశాలను చెప్పాలనే ప్రణాళికను సైతం ముద్రించింది. 

టీచర్లకు శిక్షణ.. 

గతేడాది వరకు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ, బొమ్మలతో ఆడించిన అంగన్‌వాడీ టీచర్లు ఇక మీదట పాఠ్యపుస్తకాలతో చదువులు చెప్పాల్సి ఉంటుంది. కేవలం నూతన విద్యాబోధనకు అనుగుణంగానే చిన్నారులకు పాఠాలు చెప్పేలా అంగన్‌వాడీ టీచర్లకు మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. ప్రతీ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధి నుంచి ఇద్దరు సూపర్‌వైజర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. అనంతరం వారితో నే ఆయా ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లను 30 నుంచి 35 మందిని ఒక బ్యాచ్ చేసి మూడు రోజుల పాటు శిక్షణ పూర్తి చేశారు. చిన్నారులకు పాఠ్యాంశాల్లోని, అంశాలను నిర్బంధ విద్యలా కాకుండా, ఆటపాటలతో చిన్నారులు ఉల్లాసంగా గడుపుతూ నేర్చుకునేలా బోధించేం దుకు టీచర్లకు శిక్షణ అందించారు. పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అంగన్‌వాడీ కేంద్రాల్లో అందనుండగా కేంద్రాలకు వచ్చే చిన్నారులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతో ప్రైవేటులో ప్లేస్కూల్స్‌కు వెళ్లే చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.  

ప్రతి టీచర్ బోధించేలా.. 

వికారాబాద్ జిల్లాలో 1,107 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 33,003 మంది చిన్నారులు ఉండగా, 3 నుంచి 6 ఏళ్లలోపు వారు 5,940 మంది ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తుండగా, చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో టీచర్లు మొక్కుబడిగా విద్యా బోధన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేసింది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. దీంతో ప్రతి టీచర్ చిన్నారులకు విద్యాబోధన చేయాల్సి ఉంది. 

యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు.. 

పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు రెండు జతల యూనిఫాం కూడా అందించనున్నారు. అదే విధంగా పిల్లల సంఖ్యకు అనుగుణంగా రెండు రకాల పాఠ్యపుస్తకాలను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేశారు. అందులో ప్రియదర్శిని, పూర్వ ప్రాథమిక విద్య కరదీపిక ఉన్నాయి. పిల్లలకు ఏయే రోజు ఏయే అంశాలను నేర్పించాలి, నేర్చుకునే అంశాలను ఆటపాటల రూపంలో ఏ విధంగా అందించవచ్చో అందుకు అనుగుణంగా పుస్తకాలను ముద్రించారు. 9 పాఠ్యాంశాలను 43 వారాల ప్రణాళికలుగా రూపొందించారు.

ఈ విషయాలపై టీచర్లకు శిక్షణ అందించారు. అందుకోసం అంగన్‌వాడీ టీచర్లకు సహాయంగా ఉండేందుకు పూర్వ ప్రాథమిక విద్యా దీపిక పుస్తకాన్ని అందించారు. ఉదయం 9 నుంచి సాయం త్రం 4 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు టైం టేబుల్‌ను రూపొందించారు. ప్రతి అరగంట సేపు ఒక్కో అంశంపై చిన్నారులకు బోధన జరిగేలా టైం టేబుల్‌ను తయారు చేశారు. దీనిని ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో అమలు చేసేలా ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు నిత్యం పర్యవేక్షించాలని శిశు సంక్షేమ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి.  

ప్రణాళికలు సిద్ధం..

చిన్నారులకు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించేలా ప్రణాళికలు తయారు చేశారు. అందులో భాగంగానే అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థికి అంగన్‌వాడీలోనే చదువుపై పట్టు వచ్చేలా బోధన ఉంటుంది. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ఈ ఏడాది రెండు జతల యూనిఫాం కూడా అందిస్తున్నాం.

ఏ వెంకటేశ్వరమ్మ, జిల్లా సంక్షేమ అధికారిణి