18-03-2025 07:24:17 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల పాఠశాలలో మంగళవారం విద్యార్థులచే తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు వారి వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత మాట్లాడుతూ... విద్యార్థులు సమాజంలో విలువలతో కూడిన విద్యను నేర్చుకొని, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులు, గురువులకు పేరు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మడక మధు మాటాడుతూ... పిల్లలు కాంపిటీటివ్ స్పిరిట్ తో ముందుకెళ్లి ఎవరైతే పది పాయింట్లు సాధిస్తారో వారందరికీ ఒక్కొక్కరికి ఐదువేల రూపాయల బహుమతి అందజేస్తానని, నాతో పాటుగా ఇంకా కొంతమంది దాతలు ఆర్థిక సహాయం చేయుటకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చదువులో పోటీ పడుతూ ముందుంటే ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ... పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలని వారిని గౌరవించాలని ఇష్టంగా చదువుకొని తల్లిదండ్రులకు చదివు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సుధారాణి, సరితా దేవి, హోలీ పాషా, శ్రీనివాస్ వసుద ప్రియ, ఇ.వీరేశం, లీలరాణి, ఫర్హానా కౌసర్, రజిత, సాహెద బేగం, ప్రసూనా, పూర్ణిమ, ఆంజనేయులు పాల్గొన్నారు.