calender_icon.png 26 March, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల ఆలోచన అదుర్స్

26-03-2025 12:03:15 AM

  1. కారు చౌకగా థర్మాకోల్ కూలర్ తయారీ
  2. వేసవి నుంచి ఉపశమనానికి సరికొత్త ప్రయోగం

ఆదిలాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి చల్లటి వాతావరణం కోసం పరుగులు తీస్తా రు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపంతో ప్రజలు ఇంటా, బయట ఉండలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇంట్లో అట కెక్కిన కూలర్లను కిందికి దించి వాటికి మరమ్మత్తులు చేయిస్తున్నారు. ఆర్థికంగా కొద్దిగా బలంగా ఉన్నవారు ఏసీలను ఉపయోగించి ఉపశమనం పొందుతున్నారు.

కానీ కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. అయితే కూలర్లు, ఏసీలు కొనలేని పేదలు, సామాన్యులు ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేదల ఇబ్బందులను తొలగించి మండు వేసవిలో వారికి తక్కువ ధరకే ఏసీని తలపించే చల్లగాలి అందేలా కారు చౌకగా సరికొత్త కూలర్‌ను తయారు చేసి ఔరా అనిపించుకున్నారు ఆదిలాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు. ఇంతకీ ఆ కూలర్ ఎలా పనిచేస్తుంది... ఆ కూలర్‌ను తయారు చేసిన విద్యార్థులు ఎవరు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ విభాగానికి చెందిన రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రదీప్, ప్రవీణ్, సయ్యద్ హకీం, సాయి కిరణ్, ఓంకార్, సాయి కిరణ్ ఒక బృందంగా ఏర్పడి థర్మాకోల్ కూలర్‌కు రూపకల్పన చేశారు.

కేవలం 350 రూపాయల ఖర్చుతో ఆ విద్యార్థులు తయారు చేసిన ఈ కూలర్‌తో గది చల్ల బడుతోంది. కళాశాలలోని మెకానికల్ విభాగం హెచ్.ఓ.డి నీల్‌కమల్ పర్యవేక్షణలో విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండేలా సరికొత్త కూలర్‌ను రూపొందించారు. ఈ కూలర్‌ను పాలిటెక్నిక్ కళాశాలల పోటీల్లో ప్రదర్శంచి, అందరి ప్రశంసలు సైతం అందుకున్నారు. 

తయారీకి కావలసిన సామగ్రి

ఈ థర్మాకోల్ కూలర్ తయారు చేసుకోవలంటే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కేవలం 350 రూపాయల్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఓ థర్మాకోల్ పెట్టె, ఐసు ముక్కలు, ఎనిమిది నుంచి పన్నెండు వాట్ల సామర్ధ్యమున్న ఎగ్జాస్ట్ ఫ్యాన్, రెండు పైపులు. ఈ పైపుల ద్వారా చల్లని గాలి బయటకు వస్తుంది.

థర్మాకోల్ పెట్టెకుపైన ఉన్న మూతకు ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చి, పెట్టెల లోపల ఐసు ముక్కలను వేసి మూతపెట్టేస్తారు. ఫ్యాన్ ఆన్ చేయడంతో ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటి గాలిని లోపలికి పంపిస్తుంది. అలా లోపలికి వెళ్లిన గాలి ఐసు ముక్కలకు తాకి చల్లిబడి పెట్టెకు దానికి అమర్చిన రెండు పైపులతో చల్లటి గాలి బయటకు వస్తుంది.

దీంతో పది నిముషాల్లోనే గది మొత్తం చల్లిబడిపోతుంది. దినమంతా ఆ కూలర్‌ను ఉపయోగించిన ఒక్క యూనిట్‌లోపే కరెంటు ఖర్చవుతుంది. పెద్దగా కరెంటు బిల్లు వస్తుందన్న బెంగ కూడా ఉండదని విద్యార్థులు వివరించారు. 

విద్యార్థులకు పలువురి అభినందనలు

ఏదిఏమైనప్పకీ తక్కువ ఖర్చుతో పది మందికి పనికివచ్చేలా చక్కటి కూలర్‌ను తయారు చేసిన విద్యార్థులను, ఆ విద్యార్థిలకు చక్కటి మార్గదర్శనం అధ్యాపకుడిని అందరు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విద్యార్థులు మరిన్ని సరికొత్త ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షిద్దాం.