06-03-2025 12:31:19 AM
వ్యక్తిత్వ వికాస నిపుణుడు రమేష్ చైతన్య
తాడువాయి, మార్చ్ 5 (విజయక్రాంతి): విద్యార్థులు యువత లక్ష్యాన్ని నేర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అప్పుడే సక్సెస్ అవుతారని వ్యక్తిత్వ వికాస నిపుణులు రమేష్ చైతన్య అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా తాడువాయిలో గురుకుల పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించారు. ‘జీవన నైపుణ్యాలు, పరీక్షల్లో ఒత్తిడి‘ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ స్పీకర్ రమేష్ చైతన్య మాట్లాడారు.
పరీక్షల్లో అనుసరించవలసినటువంటి వ్యూహాలను, జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే చిట్కాలు, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి , నైతిక విలువలు మరియు జీవన నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలో ఈ అవగాహన సదస్సులో విద్యార్థులకు నేర్పించడం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ప్రేమించవలసింది తల్లిదండ్రులనే కానీ సినిమా హీరోలను కాదు అని అన్నారు.
జీవితంలో లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రస్తుతం యువత మొబైల్ ఫోన్ దాటుకుని డ్రగ్స్ దాటుకుని చెడు వ్యసనాలు అన్ని దాటుకుని ముందుకు వెళ్లాలని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవితంలో ప్రతి అంశం నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలని పోరాట పటిమ కలిగి ఉండాలని పిరికితనం వదిలేసి ధైర్యంగా ఉండి జీవితంలో ఏదో సాధించాలి గాని ఆత్మహత్యల ఆలోచనలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేఖ సీనియర్ ఉపాధ్యాయినులు భాను జ్యోతి, అనూష , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.