17-03-2025 10:37:33 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకెనపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య అన్నారు. సోమవారం సాయంత్రం ఆకెనపల్లి హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు ఒక లక్ష్యంతో ప్రిపరేషన్ కొనసాగించాలని సూచించారు. ఫిజికల్ డైరెక్టర్ ఎస్. కె రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి ముందుగా తన తల్లిదండ్రులు, గురువులను రోల్ మోడల్ గా తీసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా పేరొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లుగా ప్రతి విద్యార్థి మూడు ఉన్నత లక్షలతో ముందుకు సాగాలన్నారు.
జన్మనిచ్చిన గ్రామానికి, చదువుకున్న పాఠశాలకు గుర్తింపు తెచ్చే విధంగా గొప్ప చదువులు చదవాలని సూచించారు. చిన్ననాడు చదువుకున్న పాఠశాలకే గొప్ప వ్యక్తులుగా వచ్చి విద్యార్థులకు మార్గదర్శకులుగా విలువైన సూచనలు అందించాలని కోరారు. సమాజం ఆదరించే గొప్ప వ్యక్తులుగా జీవితంలో పైకి ఎదిగేలా కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థినీలు ప్రదర్శించిన డ్యాన్స్ సంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాజమౌళి, అమ్మ ఆదర్శ విద్యా కమిటీ చైర్మన్ వనిత, ఉపాధ్యాయులు రమేష్, రామస్వామి, తిరుపతి రెడ్డి, అపర్ణ, పద్మ, రమాదేవి, రమాలత, స్వామి, సాయిబాబా, సురేష్ లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.