calender_icon.png 1 March, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు కష్టపడి ఇష్టపడి చదవాలి

01-03-2025 06:35:05 PM

మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం..

అలరించిన మోడల్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశం అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంఈఓ వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగించడం జరిగిందని, వార్షిక పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులకు బుక్ లేట్ విధానం అమలు చేయడం జరుగుతుందన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఉత్తీర్ణత ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ గాంధీ మాట్లాడుతూ... పరీక్షా సమయంలో విద్యార్థులు పాటించాల్సిన పలు జాగ్రత్తలను సూచించారు. పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ జహంగీర్, ఉపాధ్యాయులు ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్, బలవంతరావు, విద్యా రమణ తదితరులు పాల్గొన్నారు.