28-01-2025 05:46:19 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): కష్టపడి చదివి ఉన్నత స్థానాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కష్టపడి ప్రతీరోజూ చదవాలని, పరీక్షలకు కేవలం 30 రోజుల వ్యవధి మాత్రమే ఉందని తెలిపారు. ఇంటర్మీడియట్ అనంతరం ఉన్నత విద్య కోసం మంచి ఆలోచనలతో కోర్సులను ఎంపిక చేసుకోవాలని, లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా సాగాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని 20 ప్రభుత్వ కళాశాలల్లోనీ ఎంపిక చేసిన విద్యార్థులకు జే.ఈ.ఈ. వంటి పరీక్షలలో సీటు సాధించేందుకు కోచింగ్ తరగతులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆన్ లైన్ తరగతుల ద్వారా అనుభవజ్ఞులైన ఉపాద్యాయులచే కోచింగ్ తరగతులు నిర్వహించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కోచింగ్ లో హాజరయ్యే అవకాశం కల్పించుకోవాలని తెలిపారు.
దాతల సహకారంతో కళాశాలకు అవసరమైనవి సమకూర్చుకోవాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి షేక్ సలాం మాట్లాడుతూ... పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించాలని, కష్టపడి చదవాలని, సమయం వృధా చేయకూడదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ జయకుమారీ మాట్లాడుతూ... తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, ఇదే కళాశాలల్లో ప్రిన్సిపాల్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గత సంవత్సరం వార్షిక పరీక్షలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 45 శాతం, రెండవ సంవత్సరంలో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, ఈ సంవత్సరం 80 శాతం టార్గెట్ గా నిర్ణయించామని తెలిపారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదవాలని ప్రతీసారి విద్యార్థులకు తెలియజేస్తున్నమని అన్నారు. సమయం వృధా చేయకూడదని తెలిపారు. స్థానిక డాక్టర్లు నగదు ఆర్థిక సహకారం అందించారని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన డ్యాన్స్ ను తిలకించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటోలు కలెక్టర్ అందజేశారు. దాతలను శాలువా, మెమోంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాతలు డాక్టర్ జి.రవీందర్ రెడ్డి, డాక్టర్ ఆర్వీంద్, డాక్టర్ కృప, కళాశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.