అదనపు కలెక్టర్ దీపక్ తివారి....
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా అడుగులు వేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి శనివారం కెరమేరీ మండలం గోయగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, వంటశాల, రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఎంచుకున్న లక్ష సాధనకు కృషి చేయాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.
ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేస్తూ తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించారు. అంతకుముందు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లు సూపర్ చెక్, ఎస్. బి. ఎం. టాయిలెట్ కాంప్లెక్స్ మార్క్ అవుట్, సాకడ గ్రామంలో రైతు భరోసా, రేషన్ కార్డుల క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమాల నిర్వహణ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత దరఖాస్తుదారుల వివరాలను సేకరించడం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఎస్. బి. ఎం. టాయిలెట్ కాంప్లెక్స్ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతు భరోసా, రేషన్ కార్డులు కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు లేకుండా జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితా తయారు చేయాలని, వ్యవసాయ అధికారులు రూపొందించిన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పథకాల వారీగా అధికారులను నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.