calender_icon.png 19 April, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

04-04-2025 12:47:23 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్3 (విజయక్రాంతి): విద్యార్థులు గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని జిల్లా విద్యాధికారి కె. రాము అన్నారు. జిల్లాలోని గొల్లపల్లి మండలం చిలువాకోడుర్ ఉన్నత పాఠశాలలో గురువారం గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజనల్ నర్కోటిక్ కంట్రోల్ సెల్ డిఎస్పి ఉపేందర్  ఆధ్వర్యంలో విద్యార్థులకు మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము  హాజరై గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణపై విద్యార్థులు జాగరూకతతో ఉండేందుకు తయారు చేసిన రాష్ట్రస్థాయిలో ఎంపికైన కరపత్రాన్ని పరిశీలించి విద్యార్థిని ఎస్.సమన్విని శాలువాతో సన్మానించారు.

తోటి విద్యార్థుల్లో చైతన్యం నింపేలా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా రూపొందించిన కరపత్రం చాలా ప్రశంసనీయంగా ఉందన్నారు. అనంతరం ఆర్‌ఎన్సిసి కరీంనగర్ డిఎస్పి ఆంటీ నార్కోటి బ్యూరో ఎస్.ఉపేందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి గంజాయి, మత్తుపదార్థాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  పాఠశాలల్లో డ్రగ్స్ అమ్మినా,  కొన్నా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.

మత్తు పదార్థాల నియంత్రణ కోసం టోల్ ఫ్రీ నెంబర్ ‘1908‘ కి కాల్ చేయాలని, అలాంటి వారి చిరునామాను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అనంతం విద్యార్థిని ఎస్.సమన్వికి వెయ్యి రూపాయిలు నగదు పారితోషకంతో పాటు మెడల్ను అందజేశారు.

గొల్లపల్లి మండలం పోలీస్ శాఖ సిబ్బంది విద్యార్థి సమన్వికి  రూ. 1500 నగదు పారితోషకాన్ని ఇచ్చి శాలువాతో  సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ రాజేష్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎస్.ప్రశాంతి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.