జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ లో గల రైతు వేదికలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ శాఖల వసతి గృహాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన ప్రేరణ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... 10వ తరగతి వార్షిక పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపి అత్యుత్తమ ఫలితాలతో రాష్ట్రంలో జిల్లాను ముందంజలో ఉంచాలని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో 10వ తరగతి చాలా ముఖ్యమైనదని, విద్యార్థుల జీవితాలకు పునాది వంటిదని తెలిపారు. 10వ తరగతి పూర్తి అయిన తర్వాత ఉన్నత చదువుల దృష్ట్యా వివిధ మార్గాలను ఎంచుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలని అన్నారు.
వార్షిక పరీక్షలకు ప్రణాళిక బద్ధంగా సన్నద్ధం కావాలని, ఎలాంటి ఒత్తిడి, అపోహలు లేకుండా ఏకాగ్రతతో చదవాలని తెలిపారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరీక్షలకు ఇంకా 45 రోజులు మాత్రమే సమయం ఉందని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అదనపు తరగతులు నిర్వహించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులు వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, ఉపాధ్యాయుడు సుందిళ్ల రమేష్, వసతి గృహ సంక్షేమ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.