calender_icon.png 28 November, 2024 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

28-11-2024 03:56:24 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

అట్టహాసంగా వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభం

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాల లో గురువారం  జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్, 52వ బాల వైజ్ఞానిక ప్రదర్శన పండగ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీఈవో ఎస్.యాదయ్యతో  కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.కలెక్టర్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ సైన్సు, గణితములను ఇష్టపడి చదివినవారు తమ సృజనతో నిత్య జీవితంలో ఎదురయ్యే  సమస్యలకు త్వరగా  పరిష్కారం చూపగలగుతారన్నారు. 

నేను కూడా  సైన్స్ గణితంలో వందకు వంద మార్కులు తెచ్చుకున్న విద్యార్థినేనని తెలిపారు. యుపిఎస్సీ ఇంటర్వ్యూలో  సైన్సు, గణితం విద్యార్థిగా సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతానని సమాధానమిచ్చి ఐఏఎస్ గా ఎంపికయ్యానన్నారు. సమస్యకు పరిష్కారం చూపడం, ఆలోచన చేయడానికి సైన్స్, గణితము ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన జిల్లా వైజ్ఞానిక సదస్సు లో భాగస్వాములైన విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగేలా ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర, జాతీయ స్థాయిలో మన జిల్లా ఖ్యాతిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ  నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులన్నారు. విద్యార్థులు  విజ్ఞానంతో పాటు భారతీయ సంస్కృతిని అందిపుచ్చుకోవాలని సూచించారు. విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.యాదయ్య మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రదర్శనశాలలను ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డిఈఓ యాదయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. ప్రతి ప్రాజెక్టును పరిశీలించి ఆసక్తితో ప్రాజెక్టు గురించి విద్యార్థులు నడిగి తెలుసుకున్నారు. సూచనలు చేశారు. ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థులచే ప్రదర్శింపబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.   

కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ  దిల్లీ సీనియర్ అసోసియేట్ శుభదీప్ బెనర్జీ పాల్గొని ఇన్ స్పైర్ ఉద్దేశాన్ని వివరించారు. నిర్వాహక కమిటీ ప్రముఖులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీదేవి , సెయింట్ మేరీ పాఠశాల ప్రిన్సిపల్ త్రిష్యమ్మ, కాగజ్నగర్ ఎంఈఓ వాసాల ప్రభాకర్, డిఈఓ కార్యాలయం ఎఫ్ఏవో జె. దేవాజీ, ఏసీజీఈ ఉదయ బాబు, ఆసిఫాబాద్ ఎంఈఓ ఆర్ .సుభాష్, ఏసీఎంఓ ఉద్ధవ్, కార్యక్రమ కో కన్వీనర్ ,జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్, జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు వేదికను పంచుకున్నారు. సమన్వయకర్తలుగా ధర్మపురి వేంకటేశ్వర్లు, యు.ఎన్.చారి, కే.ఊశన్న వ్యవహరించారు.