05-04-2025 01:09:42 AM
ఘనంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వార్షికోత్సవం
రాజేంద్రనగర్, ఏప్రిల్ 4(విజయక్రాంతి): విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో తమకు నచ్చిన రంగంలో రాణించాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. శంషాబాద్ మున్సిపల్ జెడ్ పి హెచ్ ఎస్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజ్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
ప్రతి విద్యార్థి ఆర్థిక పరిస్థితులు ఎంతో ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉచిత విద్య అందించడం ద్వారా సమాన అవకాశాలు వస్తున్నాయన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిన లక్ష్యంతో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినట్లు వివరించారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.
తమ తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ మహేందర్ రెడ్డి, నార్సింగి మార్కెట్ మాజీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్, కళాశాల ప్రిన్సిపాల్ హిమ బిందు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.