calender_icon.png 25 November, 2024 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోను రాణించాలి

11-11-2024 06:10:26 PM

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోను రాణించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో క్రీడ పోటీలలో గెలిచిన విద్యార్థులను జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఏకాగ్రతతో చదువులోను రాణించాలని అన్నారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి గిరిజన సంక్షేమ బాలికల క్రీడా పోటీలలో జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలకు చెందిన 14-17 సంవత్సరాల వయసు గల విద్యార్థినులు ఓవరాల్ ఛాంపియన్షిప్, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ లో నిర్వహించిన హ్యాండ్ బాల్ పోటీలు, ఉట్నూర్ లో నిర్వహించిన ఖో ఖో పోటీలలో పాల్గొని బంగారు పథకాలు సాధించారని తెలిపారు.

విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలో రాణించాలని, సమాజంలో మంచి గుర్తింపును సాధించుకోవాలని అన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగడంతో పాటు స్నేహభావం పెంపొంది, విద్యలో ఏకాగ్రతతో రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, గిరిజన సంక్షేమ క్రీడాధికారి మీనారెడ్డి, ఎ.సి.డబ్ల్యూ.ఓ. ఉద్ధవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగు, శిక్షకులు విద్యాసాగర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.