calender_icon.png 9 January, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

08-01-2025 10:20:06 PM

సంగారెడ్డి సైబర్ సెల్ డీఎస్పీ వేణు గోపాల్ రెడ్డి...

సంగారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులపై అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి సైబర్ సెల్ డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. విద్యార్ధులకు డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఆన్ లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రతి నెల మొదటి బుధవారం సైబర్ జాగురుకత దివాస్ పేరుతో మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

సైబర్ క్రైమ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని, సైబర్ నేరాలకు గురి అవుతున్న వాళ్ళల్లో అధికంగా విద్యావంతులే అధికం అన్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ప్రభుత్వ స్కీమ్స్, నఖిలి కరెంట్ బిల్, ఆన్లైన్ లో కొరియర్, డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్, వివిధ రకాల apk ఫైల్స్ పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతూ.. అమాయక ప్రజలను సైబర్ బాధితులుగా చేస్తున్నారన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో గుర్తు తెలియని, కొత్త ఫోన్ నెంబర్ల నుండి అపరిచిత వ్యక్తి వీడియో కాల్ చేసి, వీడియో రికార్డు చేసి బెదిరింపులకు గురిచేయడం జరుగుతుందన్నారు. పోలీసు అధికారులు, కస్టమ్స్ అధికారులం అని కాల్స్ వస్తే భయపడవద్దని, ఏ పోలీసు అధికారి వీడియో కాల్ చేయరన్నారు. 

సోషల్ మీడియాలో ఏదైనా కొత్త లింక్ ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, కొరియర్, పార్సిల్ పేరుతో వచ్చిన కాల్స్ కు ఓటిపి చెప్పారాదని అన్నారు. ఆన్ లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు మారువేషంలో పొంచి ఉంటారాని గుర్తించాలన్నారు. సైబర్ మోసాల నుండి తప్పించుకోవడానికి అవగాహన ఒక్కటే మార్గమని, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురి అయినట్లయితే వెంటనే 1930 కి కాల్ చేసి గాని, NCRP పోర్టల్ https://www.cybercrime.gov.in/ నందు లాగిన్ అయి ఫిర్యాదు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, D4C టెక్నికల్ సపోర్ట్ పర్సన్ రాజలింగం గౌడ్, శ్రీహరి ఐటి సెల్ సిబ్బంది, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.