calender_icon.png 18 April, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలి

09-04-2025 07:57:29 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా పాఠశాలలకు కేటాయించిన మేరకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ సమన్వయకర్త చౌదరిలతో కలిసి మండల విద్యాధికారులు, ఎ.పి.ఎం.లు, జిల్లా సమాఖ్య, మెప్మా సభ్యులతో ఏకరూప దుస్తుల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, వంటశాల, భోజనశాల, ప్రహారీగోడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తుందని తెలిపారు.

ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, మే నెల 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించి దుస్తుల తయారీ కొరకు కొలతలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కొరకు మహిళ స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఒక జత దుస్తులకు 75 రూపాయలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు హైదరాబాద్ లో అందించిన శిక్షణకు సంబంధించిన ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.