05-03-2025 01:20:52 AM
కొండమల్లేపల్లి బాలిక గురుకుల పాఠశాల తనిఖీ
నల్లగొండ/ దేవరకొండ, మార్చి 4 (విజయక్రాంతి) : విద్యార్థులకు గుణాత్మక విద్యనందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను ఆమె తనిఖీ చేశారు. వంటగది, స్టోర్‌రూమ్, కూరగాయలు, బియ్యం నిల్వచేసే స్థలం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. పాఠశాల, కళాశాల నిర్వహణ బాగుందని సంతృ ప్తి వ్యక్తం చేశారు.
వంటగదిని, డైనింగ్ హాల్ ను, బియ్యం, కూరగాయలు నిల్వచేసే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. అనంతరం 8వ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఇంగ్లీష్, మాథ్స్ సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థినులు చకచకా సమాధానాలు చెప్పడంతో అభినందిం చి చాక్లెట్లు అందించారు. అనంతరం ఆమె గుడిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి ఎక్కువ మంది సెలవులో ఉండడంపై ఆరా తీశారు. మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు నల్లగొండ పరిధిలోని చర్లపల్లి విపస్య పాఠశాల, మీర్‌బాగ్ కాలనీలోని నల్లగొండ పబ్లిక్ పాఠశాలల్లో నీట్ పరీక్ష నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో అన్నీ మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.