13-03-2025 01:58:46 AM
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీల ప్రకారం విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
బుధవారం జిల్లాలోని కెరమెరి మండలం గోయ గాం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, సంక్షే మ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని తెలిపా రు.
ఉపాధ్యాయులు పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించాలని తెలిపారు. వంట సమయంలో నాణ్యత గల నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, గ్యాస్ స్టవ్‌పై వంట చేయాలని తెలిపారు. పాఠశాలలో వంటశాల నిర్మాణం చేపట్టి వేసవి సెలవుల అనం తరం పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవికాలం అయినందున ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూత్రశాలలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షిం చాలని తెలిపారు. 10వ తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, గణితం సబ్జెక్టు పై విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షలపై విద్యార్థులలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సబ్జెక్టుల వారీగా విద్యార్థులు చర్చించుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి ఆడే ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి
రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం ధనోరా వద్దగల డబ్ల్యూటీపిని సందర్శించి మిషన్ భగీరథ ఈఈ రాకేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత పెరిగిన నేపథ్యంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
ప్రతి గ్రామానికి భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్న గ్రామాలను గుర్తించడంతోపాటు వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.
రానున్న వేసవిలో అనుసరించాల్సిన విధానానికి సంబంధించి కిందిస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఏది ఏమైనా ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత భగీరథ అధికారులపై ఉందని తెలిపారు. వేసవి దృష్ట్యా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను మిషన్ భగీరథ ఈఈ రాకేష్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ధరణి పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి
వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్ లో అందిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడి యో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, అన్ని మండలాల తహసిల్దార్లతో ధరణి (భూభారతి)లో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తు ఫైల్ వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, అదనపు కలెక్టర్, సబ్ కలెక్టర్, రాజస్వ మండల అధికారి లాగిన్ లలో ఉన్న ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ధ్రువీకరణ పత్రాల కొరకు వచ్చే దరఖాస్తులను నిబంధనలకు లోబడి త్వరగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రతిరోజు సమక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.