12-03-2025 07:22:55 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఇటీవల పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీల ప్రకారం విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(Collector Venkatesh Dhotre) అన్నారు. బుధవారం జిల్లాలోని కెరమెరి మండలం గోయగాం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, హాజరు పట్టిక, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాలలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించాలని తెలిపారు.
వంట సమయంలో నాణ్యత గల నిత్యవసర సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, గ్యాస్ స్టవ్ పై వంట చేయాలని తెలిపారు. పాఠశాలలో వంటశాల నిర్మాణం చేపట్టి వేసవి సెలవుల అనంతరం పాఠశాల ప్రారంభమయ్యే నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, వేసవికాలం అయినందున ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, మూత్రశాలలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. 10వ తరగతి గదిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని, గణితం సబ్జెక్టు పై విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పరీక్షలపై విద్యార్థులలో ఎలాంటి ఒత్తిడి లేకుండా సబ్జెక్టుల వారీగా విద్యార్థులు చర్చించుకునేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నోడల్ అధికారి ఆడే ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.