కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో జిల్లాలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మెనూలో పేర్కొన్న విధంగా సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ లతో కలిసి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో కొనసాగుతున్న పాఠశాలలు, వసతి గృహాల ప్రిన్సిపాల్ లు, ప్రత్యేక అధికారులు, వార్డెన్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 20 శాతం పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఆహారం తయారీకి వినియోగించే సరుకులు గదులలో నిలువ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వంట గదులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు అందించే త్రాగునీరు, వంటలలో వినియోగించే నీటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. వంట సరుకులను క్రమ పద్ధతిలో వినియోగించాలని, స్టాకు అధిక మొత్తంలో ఉండకూడదని, బియ్యం నిల్వ చేసే గదులలో బియ్యం సంచులు గోడకు ఆనుకొని ఉంచకూడదని, కొంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈనెల 14వ తేదీన ప్రతి విద్యాలయంలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులకు అందించే మెను పట్టిక ఫ్లెక్సీలను వంట గది, భోజనశాల వద్ద ప్రదర్శించాలని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కార్యక్రమానికి ఆహ్వానించి, హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అతిధులకు నాణ్యమైన భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పెంచిన డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలపై అందరికీ అవగాహన కల్పించాలని, విద్యార్థులతో తెలంగాణ సంస్కృతి పై సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని, వచ్చే 3 నెలల కాలంలో సిబ్బందికి, ఉపాధ్యాయులకు, కార్మికులకు కిచెన్, డైనింగ్, వంట సరుకుల నిర్వహణపై శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, షెడ్యూల్డ్ కులాల ఉపసంచాలకులు సజీవన్, జిల్లా విద్యాధికారి ఉదయ్ బాబు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు తదితరులు పాల్గొన్నారు.