బెల్లంపల్లి సివిల్ జడ్జి జె. ముఖేష్
బెల్లంపల్లి (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు అందేలా చూడాలని బెల్లంపల్లి సివిల్ జడ్జి జె. ముఖేష్ ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన కాసిపేట మండలంలోని కస్తూరిబా బాలికల విద్యాలయం తో పాటు మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా మండల లీగల్ సేల్ అథారిటీ ఆధ్వర్యంలో ఆకస్మికంగా సందర్శించారు.
కస్తూరిబా గాంధీ విద్యాలయం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా ఉండడం లేదని, పాడైపోయిన పదార్థాలు పెడుతున్నారని విద్యార్థినీలు వాపోడంతో ఆయన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుండి విద్యార్థినులకు సక్రమమైన భోజనం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన బోధన అందేలా చూడాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులను కోరారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి ఎదిగానని, విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఆయన వెంట న్యాయవాదులు మాదరి రాకేష్, శివకుమార్ లతోపాటు మండల లీగల్ సెల్ అథారిటీ సభ్యులు ఉన్నారు.