జగిత్యాల అర్బన్, జనవరి 30 (విజయక్రాంతి): పదవ తరగతి విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాసేలా ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ ఇవ్వాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులలో ఆత్మ స్థైర్యాన్ని నింపి, భవిష్యత్తులో ఉన్నతంగా రూపు దిద్దుకునేందుకు అవసరమైన కౌన్సెలింగ్ ఎలా ఇవ్వాలనే అంశాలపై ఒక్కో పాఠశాల నుండి ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి రాము గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అందరు శిక్షణ అనంతరం పరీక్షలు ధైర్యంగా రాసేలా పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. కౌమార దశలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల గురించి, వారికి ఎదురయ్యే స్ట్రెస్ , భవిష్యత్తులో విద్యార్థుల ప్రగతి, అభివద్ధి కోసం కావలసిన మార్గదర్శనం కౌన్సిలింగ్ వంటి అంశాల గురించి రిసోర్స్ పర్సన్స్ రాజేందర్, దత్తాద్రి, రాజశేఖర్, రవిలు వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైట్ లెక్చరర్, కోర్స్ డైరెక్టర్ హబీబ్, సెక్టోరల్ అధికారి కొక్కుల రాజేశ్ పాల్గొన్నారు.