30-04-2025 05:33:15 PM
విద్యాధికారి నాగేశ్వరరావు...
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండలంలోని అనుమతులు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పించవద్దని బాన్సువాడ మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. బుధవారం మండల విద్యా వనరుల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేసి ఆయన మాట్లాడారు. బాన్సువాడ మండలంలో 20 ప్రైవేటు పాఠశాలలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతి లేకుండా పలు పాఠశాలలు అడ్మిషన్లు చేసుకుంటున్నట్లు సమాచారం ఉందన్నారు. నూతనంగా ప్రారంభించే పాఠశాలలు, పాఠశాల బోర్డులు ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బాన్సువాడ పట్టణంలో శ్రీ చైతన్య, అర్బర్ హైట్స్, మదీన స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది అన్నారు.
ఆ పాఠశాలలకు ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. ఈ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తల్లిదండ్రులు గమనించాలని కోరారు. అనుమతి లేని పాఠశాలలో విద్యార్థులని చేర్పించి వారి భవిష్యత్తుని నాశనం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల అనుమతి కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 వరకే గడువు ఉండేదని, గడువు ముగిసి కూడా చాలా రోజులైంది అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞతతో ఆలోచించి ప్రభుత్వ అనుమతి ఉన్న పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలు ఉంటే నేరుగా తమను సంప్రదించాలని కోరారు.